సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక
నూతన అసెంబ్లీ భవనంపై ఎత్తైన స్పియర్ నిర్మాణానికి ఆమోదం
రెండో దశలో ఎకరం కంటే తక్కువున్న రైతులకు యాన్యుటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
అమరావతి, సెప్టెంబరు 18: అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం ఓ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డిఏ అథారిటీ సమావేశం వివిధ ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్ సహా లిఫ్ట్‌లను నిర్మించేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. రూ.661 కోట్ల వ్యయంతో స్పియర్ సహా లిఫ్ట్‌ల నిర్మాణానికి అథారిటీ సమావేశం ఆమోదాన్ని ఇచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. హోటల్లు, పాఠశాలలకు భూములు కేటాయిస్తూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలియచేశారు. రెండో దశ పూలింగ్ లోనూ 1 ఎకరా కన్నా తక్కువ కమతం ఉన్న రైతులకు యాన్యుటీ చెల్లింపునకు సంబంధించి అథారిటీ ఆమోదం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేసే అంశంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దే్శం చేశారు. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన అసెంబ్లీ భవనంలో ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ స్పియర్ నిర్మాణం జరగాలని సీఎం సూచించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న అసెంబ్లీ- హైకోర్టు- సచివాలయ టవర్లతో పాటు క్వాంటం టవర్స్ , బిట్స్ పిలానీ లాంటి భవనాలు కూడా ప్రత్యేకమైన కట్టడాలుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు అమరావతి నగరంలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్ తో పాటు బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలని ఏడీసీ అధికారులను సీఎం ఆదేశించారు. పచ్చదనంతో పాటు పుష్ప జాతులకు చెందిన మొక్కలు నాటాలని అన్నారు. రాజధానిలో ఉన్న కొండలు, నీటి వనరులను కూడా అత్యుత్తమ ప్రాంతాలుగా తీర్చిదిద్దేలా ఓ బ్లూప్రింట్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అమరావతి ఘనత చాటేలా విస్తృత ప్రచారం
అమరావతి నగరం పేరును దేశవిదేశాల్లో మార్మోగేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఓ బైకర్‌ను ఓ బాలుడు అమరావతి నుంచి వచ్చారా అంటూ మాట్లాడిన అంశం రాజధాని అమరావతి పేరు ప్రజల మనస్సుల్లోకి ఎంతగా చొచ్చుకు పోయిందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఇలా దేశ, విదేశాల్లోనూ అమరావతి ఘనతను చాటేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాలు లేని, బ్లూ గ్రీన్, డీప్ టెక్ , గ్రీన్ ఎనర్జీ లాంటి ఐదు అంశాలను థీమ్ గా అమరావతిని తీసుకెళ్లాలని అన్నారు. ప్రతీ పౌరుడూ ఇది నా నగరం అని భావించేలా అమరావతి పేరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాజధాని నగరాన్ని నడిపేలా భవిష్యత్ రెవెన్యూ మోడల్స్ పై కూడా దృష్టి సారించాలని అన్నారు. దీనిపై ఓ కమిటీని నియమించి అధ్యయనం చేయాలన్నారు. విజయవాడ- గుంటూరు- మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్లు కలిపి ఓ మెగా సిటీగా అమరావతి తయారవుతుందని సీఎం అన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్, పురపాలక, ఆర్ధిక, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు.








