ఖైరతాబాద్ ఉపఎన్నిక.. మూడు పార్టీలకు లిట్మస్ టెస్ట్!
హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో ఇక్కడ ఉపఎన్నిక దాదాపు అనివార్యమైంది. ఈ పరిణామంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలన్నిటికీ ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో రాజకీయం రంజుగా మారుతోంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నిక సవాల్‌గా మారింది. దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత అనర్హత పిటిషన్లపై హైకోర్టు వేటు వేయడం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థుడైన అభ్యర్థిని బరిలోకి దింపి గెలవడం అధికార పార్టీకి కత్తిమీద సాములాంటి విషయమే. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఓడితే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనే ప్రచారాన్నివిపక్షాలు ఉధృతం చేస్తాయి. ఇది వచ్చే జనరల్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది.
ఇక దానంపై అనర్హత వేటు రూపంలో బీఆర్ఎస్కు నైతికంగా ఒక అవకాశం దొరికినట్లయింది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకుని, ఉపఎన్నికలో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకుని, అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ నాయకులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి నైతికబలం చేకూరుతుంది.
మరోవైపు బీజేపీ కూడా ఈ పరిణామాన్ని క్షుణ్ణంగా గమనిస్తోంది. ఖైరతాబాద్‌లో బీజేపీ బలోపేతం కావడానికి ఈ ఉపఎన్నికను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి, తమ అర్బన్ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలనుకుంటోంది బీజేపీ.
అందుకే ఈ ఉపఎన్నిక మూడు పార్టీలకు కత్తిమీద సాములాంటిదే. ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బలమైన కారణాలు దొరుకుతాయి. అందుకే దీన్ని కేవలం ఒక ఉపఎన్నికగా చూడలే. వచ్చే ఎన్నికలకు దీన్నొక రెఫరెండం లాగా భావించవచ్చు.








