బీజేపీ పొలిటికల్ చోరీలకు ఈసీ దన్ను.. రాహుల్ ఫైర్..
బెంగాల్ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టుపట్టిస్తుంటే.. పరిరక్షించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సహకరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఎంసీ (TMC) గ్రూప్లు.. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టారు. ప్రజా తీర్పును రక్షించడమే ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా అది ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకు సహకరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీలను విడగొట్టి.. ఎన్నికల గుర్తును లాక్కోవడం ఈసీ, బీజేపీలకు అలవాటైపోయిందన్నారు.
‘మొదట శివసేన, ఆ తర్వాత ఎన్సీపీ.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress). ప్రతిసారీ ఇదే పద్ధతి. ఒక పార్టీని చీల్చడానికి బీజేపీ, ఎన్నికల సంఘం (EC) చేతులు కలుపుతాయి. ఆ తర్వాత దాని ఎన్నికల గుర్తును లాగేసుకుంటాయి. ఒక పార్టీ మొత్తాన్నే దొంగలించగలిగినప్పుడు, కోట్లాది మంది భారతీయుల ఓట్లను కూడా చోరీ చేయడంలో ఆశ్చర్యం లేదు.
ఓటు దొంగలు, ప్రభుత్వ దొంగలు.. ఇప్పుడు పార్టీల దొంగలుగా మారారు. ఈ చర్యలు మన ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలుగా మారాయి. పార్టీని కాపాడుకోవాలనే ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదు. ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు పోరాటం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.








