సుప్రీంలో దానం అనర్హత కేసు.. ఈ మూడే ఆప్షన్స్!?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి మొదలైంది. హైకోర్టు అనర్హత వేటును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. న్యాయస్థానం నిర్ణయం దానం రాజకీయ భవితవ్యాన్నే కాకుండా, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సైతం సమూలంగా మార్చే అవకాశం ఉంది.
సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ప్రస్తావించారు. హైకోర్టు తీర్పు అమల్లోకి వస్తే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ పిటిషన్‌పై తక్షణమే లేదా మరుసటి రోజే విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. గతంలో స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో న్యాయపరమైన అభ్యంతరాలను ధర్మాసనం ముందుంచారు.
మరోవైపు, ప్రతివాదులైన బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు సైతం అంతే దీటుగా రంగంలోకి దిగారు. తమ క్లైంట్లు ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారని గుర్తుచేస్తూ, తమ వాదనలను కూడా సంపూర్ణంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం వెలువరించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను ప్రాథమికంగా విన్న ధర్మాసనం, పిటిషన్‌పై బుధవారం పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేదానిపై పడింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో లేదా స్టే విధిస్తుందా అనేది ప్రధాన చర్చ. ఒకవేళ ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే దానం నాగేందర్‌కు తక్షణ ఉపశమనం లభిస్తుంది. తద్వారా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ముప్పు ప్రస్తుతానికి తప్పినట్లే అవుతుంది. ఇక, పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకునే తుది అధికారం అసెంబ్లీ స్పీకర్‌కే ఉంటుందనే గత సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా.. ఈ వివాదాన్ని మళ్లీ పునఃపరిశీలించాలని స్పీకర్‌కే అప్పగిస్తుందా అనేది మరో వాదన. ఇక మూడోది.. తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని భావించి హైకోర్టు వెలువరించిన అనర్హత నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా అన్నది అత్యంత కీలకమైన అంశం. అదే జరిగితే దానం నాగేందర్ శాసనసభ్యత్వాన్ని తక్షణమే కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా ఖైరతాబాద్‌కు ఆరు నెలల వ్యవధిలో బైపోల్ అనివార్యమవుతుంది.
సీనియర్ న్యాయవాదులు ఇరువైపులా రాజ్యాంగ నిబంధనలు, గత పూర్వాపరాలను ఎత్తిచూపుతూ వాదనలు వినిపించనున్న నేపథ్యంలో.. న్యాయస్థానం ప్రజాస్వామ్య వ్యవస్థల పరిధిని, స్పీకర్ విశేషాధికారాలను ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్‌లో బైపోల్ నగారా మోగుతుందా లేక దానం నాగేందర్‌కు న్యాయపరమైన రక్షణ దక్కుతుందా అన్న సందిగ్ధతకు బుధవారం జరిగే విచారణతో కొంతమేర తెరపడే అవకాశముంది.








