దానం నాగేందర్ యూటర్న్ వెనుక వ్యూహమేంటి?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే పదవికి అనర్హుడని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్ ధీమాగా కనిపించారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ప్రజలక్షేత్రంలో తేల్చుకుంటానని, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేయడం లేదని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టమైన ప్రకటన చేశారు.
దీంతో ఖైరతాబాద్ స్థానానికి త్వరలోనే ఉపఎన్నిక జరగడం ఖాయమని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దానం నాగేందర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత సుప్రీంకు వెళ్లే ప్రసక్తే లేదన్న ఆయన, ఒక్కసారిగా ప్లేట్ మార్చి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక అసలు కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా తానే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతానని ప్రకటించిన ఆయన, అంతలోనే సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక ఓటమి భయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే ఎదురయ్యే పరిణామాలు, అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే హోరాహోరీ పోరును తట్టుకోవడం ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతోనే ఆయన వెనకడుగు వేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కోర్టు ద్వారా ఈ వ్యవసాన్ని మరింత కాలం సాగదీయాలనే ఆలోచన కూడా ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు నానబెట్టడం ద్వారా ఎమ్మెల్యే పదవి కాలం నెగ్గుకురావచ్చు. లేదా స్టే తెచ్చుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే ఈ అప్పీల్ దాఖలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, దానం పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున నాయకులు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని వారు కోరుతున్నారు. గతంలో ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రస్తుత అప్పీల్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది.








