తెలంగాణలో ఫాంహౌస్ల చుట్టూ రాజకీయం!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫాంహౌస్ ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ నేతలు ఫాంహౌస్ లపై ఆరోపణలు గుప్పిస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాలు దీనిని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై అధికార కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ లను సందర్శిస్తున్నారు. ‘ఫాంహౌస్ ఫైల్స్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రధానంగా ధరణి పోర్టల్ లోని లొసుగులను అడ్డుపెట్టుకుని గత పాలకులు భారీగా భూములు కూడగట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ప్రతి ఫాంహౌస్ పై చట్టపరమైన చర్యలుంటాయని అధికార పక్షం హెచ్చరిస్తోంది. ఈ డ్రైవ్ ను మరింత విస్తృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఆక్రమణలను ఎండగడతామని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఫాంహౌస్ టూర్లపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెరపైకి తెచ్చిన డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శిస్తున్నారు. హామీల అమలు, ఫ్యూచర్ సిటీ, ఎల్ నినో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు ఈ డ్రామాలకు తెరలేపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వీటిపై విచారణ చేపట్టాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య లోపాయికారీ అవగాహన ఉందనే రీతిలో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫాంహౌస్ రాజకీయం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఇది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన పరీక్షా సమయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు, ప్రజా సమస్యలను విస్మరించి కేవలం ఫాంహౌస్ ల చుట్టూనే రాజకీయం తిరిగితే, అది భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ రాజకీయాల్లో ఫాంహౌస్ ల వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.








