కేసీఆర్ ఫాంహౌస్‌లో అసైన్డ్ భూములు గుర్తింపు?
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూములపై ప్రభుత్వం శరవేగంగా విచారణ చేపడుతోంది. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న ప్రభుత్వ గైరాన్ భూములు, అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి, సమీప శివారు వెంకాపురం గ్రామాల్లో గత మూడు రోజులుగా భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే ద్వారా ప్రభుత్వ భూముల హద్దులను స్పష్టంగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో కేసీఆర్ ఫాంహౌస్ పరిధిలో సుమారు 10 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా, దళితులకు కేటాయించాల్సిన ఈ భూములను కొందరు అన్యక్రాంతం చేసుకుని, ఫాంహౌస్ అవసరాల కోసం నీటి వనరుల నిర్మాణానికి ఉపయోగించినట్లు తేలింది.
భూ ఆక్రమణలపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సర్వే నంబర్ 325 పరిధిలోని సుమారు 388.05 ఎకరాల గైరాన్ భూమి ఆక్రమణలను గుర్తించి, సంబంధిత భూయజమానులకు గత వారంలోనే 180 నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించాల్సిన భూయజమానులు ఇవాల్టి నుంచి తమ పత్రాలతో అధికారుల ముందు హాజరవుతున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర చట్టబద్ధమైన పత్రాలను సమర్పిస్తే పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ రాకతో రికార్డులు తారుమారయ్యాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకాపురం గ్రామాల మధ్య సర్వే నంబర్లు, భూ రికార్డుల్లో తీవ్రమైన లొసుగులు, ఓవర్లాపింగ్ ఉన్నాయని మర్కూక్ తహశీల్దార్ సరితకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పాండురంగ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతన్నలకు ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని వాపోతున్నారు.
ఈ వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వివాదాస్పద సర్వే నంబర్ 325లో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను అనుభవిస్తున్న అనర్హులను తొలగించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. నిజమైన దళిత రైతులకు దక్కాల్సిన భూములను వెనక్కి తీసుకుని, నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. మరోవైపు ఏ ఒక్క దళితుడి లేదా గిరిజనుడి భూమిని ప్రభుత్వం తీసుకోదని, సెక్షన్ 22ఏ పై మళ్లీ సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.








