800 ఏళ్ల నాటి చెట్లు బయటపెట్టిన చెంఘీజ్ ఖాన్ రహస్యం!
ఒక విశాలమైన మైదానం… ఎటు చూసినా అంతులేని గడ్డి, చుట్టూ దుమ్ముతో నిండిపోయిన గాలి తప్ప మరేమీ కనిపించటందు. ఆ పచ్చటి గడ్డి మధ్యలో నుంచి వేలాది గుర్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. వాటిపై కూర్చున్న యోధులు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కానీ, ఆ గుర్రాల ముఠా దూరంగా మాయమయ్యే లోపే వెళ్లిన దిశలో ఒక కొత్త సామ్రాజ్యం పుట్టుకొస్తోంది.
అది చెంఘీజ్ ఖాన్ కాలం. చరిత్ర పుస్తకాల్లో చెంఘీజ్ ఖాన్ పేరు చూడగానే మనకు గుర్తొచ్చేవి పదునైన కత్తులు, గుర్రపు స్వారీలు, భయంకరమైన సైనిక వ్యూహాలు. కానీ, ఈ ప్రపంచ విజేత వెనుక మనం ఇన్నాళ్లూ పట్టించుకోని ఒక ఊహించని శక్తి ఉంది. అది మనుషుల సైన్యం కాదు… ప్రకృతి. అవును..మనం నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
చెట్లు చెప్పిన 800 ఏళ్ల నాటి రహస్యం
చాలా సార్లు చరిత్రకారులు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కేవలం పాత పుస్తకాలను మాత్రమే నమ్ముకోరు, కొన్నిసార్లు పాత చెట్లను కూడా చదువుతారు. మంగోలియాలోని పురాతన సైబీరియన్ పైన్ చెట్ల వలయాలను (Tree rings) పరిశీలించిన శాస్త్రవేత్తలకు గత 1,112 సంవత్సరాల వాతావరణ ఆధారాలు దొరికాయి.
ఆ చెట్ల వలయాలు చాలా విచిత్రమైన కథను, దాని వెనక ఉన్న చరిత్రను బయటపెట్టాయి. దాని ప్రకారం …చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న కాలంలో, అంటే 1211 నుండి 1225 వరకు వరుసగా 15 సంవత్సరాల పాటు మంగోలియాలో అసాధారణమైన తేమ, సమృద్ధిగా వర్షాలు కురిసాయి. ఆ వెయ్యేళ్ల కాలంలోనే అంత సుదీర్ఘకాలం వర్షాలు పడటం ఒక ప్రత్యేకమైన రికార్డ్ గా నిలిచింది.
వర్షానికి, మంగోల్ సైన్యానికి ఉన్న లింక్ ఏంటి?
మంగోలియన్ స్టెప్పీ అనేది పంటలు పండే వ్యవసాయ భూమి కాదు, కేవలం గడ్డి మైదానం. అక్కడి జీవితం పూర్తిగా పశువులపైనే ఆధారపడి ఉంటుంది. పశువులు బతకాలంటే గడ్డి కావాలి, ఇక మంగోలుల విషయానికి వస్తే గుర్రాలు వారి జీవనాధారం. గుర్రం వారికి కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, వారి వేగం, ఆహారం, సైనిక బలం అన్నీ అదే.
ఒక మంగోల్ సైన్యం వేల కిలోమీటర్లు క్షణాల్లో దూసుకెళ్లడానికి ఈ గుర్రాలే ప్రధాన కారణం. మైదానాల్లో గడ్డి తగ్గిపోతే గుర్రాల సంఖ్య తగ్గిపోతుంది, దాంతో సైనిక కదలికలు మందగిస్తాయి. కానీ, అనూహ్యంగా వరుసగా 15 ఏళ్ల పాటు పడిన వర్షాల వల్ల గడ్డి సమృద్ధిగా పెరిగింది. దానివల్ల గుర్రాల సంఖ్య విపరీతంగా పెరిగి మంగోలులకు కొండంత సైనిక బలాన్ని ఇచ్చింది.
తీవ్రమైన కరువు నుంచి మొదలైన ప్రయాణం
వాస్తవానికి చెంఘీజ్ ఖాన్ ఎదుగుదలకు ముందు, అంటే 1180ల ప్రాంతంలో మంగోలియా తీవ్రమైన పొడి వాతావరణాన్ని, కరువును ఎదుర్కొంది. వనరులు తగ్గిపోవడంతో తెగల మధ్య ఆహారం, నీటి కోసం తీవ్రమైన ఘర్షణలు జరిగేవి. ఆ క్లిష్ట సమయంలోనే టెముజిన్ అనే యువకుడు నాయకుడిగా ఎదుగుతూ, చెల్లాచెదురైన తెగలన్నింటినీ తన శక్తితో ఏకం చేసి 1206 నాటికి ‘చెంఘీజ్ ఖాన్’గా మారాడు.
ఆయన తెగలను ఏకం చేసి సరైన వ్యూహంతో సిద్ధంగా ఉన్న సమయంలోనే, ప్రకృతి రూపురేఖలు మారిపోయాయి. 1211 నుంచి కురిసిన నిరంతర వర్షాలు గడ్డి మైదానాలకు అదనపు ఇంధనాన్ని అందించాయి. ప్రకృతి ఇచ్చిన ఆ అవకాశాన్ని చెంఘీజ్ ఖాన్ తన సైనిక విస్తరణకు ఇంధనంగా మార్చుకున్నాడు.
కేవలం వర్షం పడితేనే ప్రపంచాన్ని జయించవచ్చా?
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయమేమిటంటే…కేవలం వర్షం పడింది కాబట్టే చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్యాన్ని స్థాపించేశాడని చరిత్రకారులు చెప్పడం లేదు. వర్షం వల్ల గడ్డి పెరిగింది, పశువులు, గుర్రాల సంఖ్య పెరిగి సైన్యానికి కావలసిన వనరులు సమకూరాయి.
ఆ అవకాశాన్ని ఒక అపారమైన సామ్రాజ్యంగా మార్చడానికి చెంఘీజ్ ఖాన్ వద్ద అద్భుతమైన నాయకత్వం, క్రమశిక్షణ కలిగిన సైనిక వ్యవస్థ, వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి. ప్రకృతి గుర్రాలకు ఆహారాన్ని మాత్రమే ఇవ్వగలదు కానీ, ఆ గుర్రాలను ఎటువైపు నడిపించాలో నిర్ణయించింది మాత్రం చెంఘీజ్ ఖానే.
ఇవి కూడా చదవండి
చెట్ల వలయాలు చెప్పే చరిత్ర
ఒక చరిత్రకారుడు 800 ఏళ్ల క్రితం వర్షం ఎంత పడిందో ప్రత్యక్షంగా చూడలేడు. కానీ ఒక చెట్టు చూసింది. ప్రతి సంవత్సరం అది ఒక వలయాన్ని వదిలింది. వాతావరణ పరిస్థితులు మారితే ఆ వలయాల వెడల్పు కూడా మారింది. శాస్త్రవేత్తలు ఆధునిక వాతావరణ డేటాతో ఈ వలయాలను పోల్చి, గతంలోని నీటి సమతుల్యతను పునర్నిర్మించారు. అలా చెట్టు ఒక రకమైన టైమ్ మెషీన్గా మారింది. ఆక్రమంలోనే ఆ టైమ్ మెషీన్ మనల్ని 13వ శతాబ్దపు మంగోలియాకు తీసుకెళ్లినప్పుడు… అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక ప్రపంచ విజేత ఎదుగుతున్నాడు. అతని కింద వేలాది గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాల కింద విస్తారమైన గడ్డి ఉంది. ఆ గడ్డి వెనుక… వర్షం ఉంది.
కంక్లూజన్
మనం సాధారణంగా చరిత్రను చదువుతున్నప్పుడు ఒక గొప్ప నాయకుడి ప్రతిభ వల్లే ప్రపంచం మారిపోయిందని అనుకుంటాం. కానీ, ఈ కథనంలోని విషయం మనకు మరో కోణాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి ఎంతటి ప్రతిభావంతుడైనప్పటికీ, అతనికి కాలం, ప్రకృతి పరిస్థితులు కూడా అనుకూలిస్తే ఆ విజయం ఎన్నో రెట్లు పెద్దదిగా మారుతుంది.
800 ఏళ్ల క్రితం పడిన ఆ వర్షం ప్రకృతి సిద్ధం చేసిన ఒక వేదిక అయితే, దానిపై చెంఘీజ్ ఖాన్ తన విశ్వరూపం చూపారు. గొప్ప మనుషులు చరిత్రను సృష్టిస్తారనేది ఎంత నిజమో, ఆ మనుషులు రాసే కథకు ప్రకృతి కూడా కొన్ని పేజీలను ముందే రాసి పెడుతుందనేది అంతే నిజం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








