కాంగ్రెస్ పార్టీ కొత్త సోషల్ మీడియా వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి టీపీసీసీ సోషల్ మీడియా కొత్త చైర్మన్ నవీన్ పెట్టెం నేతృత్వంలో ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 670 మండలాలకు నూతన సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తికానున్న ఈ ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ వాణి గట్టిగా వినిపించనుంది. ప్రారంభ దశలో వీరందరికీ ఎక్స్ వేదికగా, ఆ తర్వాత అసెంబ్లీ, జిల్లా స్థాయిలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జూమ్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో నిరంతరం శిక్షణ, సమీక్షలు చేపట్టనున్నారు.
కేవలం కార్యకర్తలకే పరిమితం కాకుండా డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్లు సహా సుమారు 2వేల మంది ముఖ్య నాయకుల సోషల్ మీడియా యాక్టివిటీని పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. వీరందరి ఆన్లైన్ ప్రవర్తనపై పార్టీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ద్వారా ప్రతి వారం ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన చిన్న వీడియోలను లేదా అధికారిక పోస్టులను ఈ 2వేల మంది నాయకులు రీపోస్ట్ లేదా రీషేర్ చేసినా, అది బూత్ స్థాయి వరకు సులువుగా చేరుకుంటుందని పార్టీ అంచనా వేస్తోంది. ‘సంగటన్ సృజన్ అభియాన్’ ద్వారా సేకరించిన డేటాతో ఈ లీడర్లందరినీ ఒకే వేదికపైకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియ నేపథ్యంలో, పార్టీ రక్షణ కోసం బూత్ లెవెల్ ఏజెంట్లను సోషల్ మీడియా వారసులుగా మారుస్తున్నారు. ఇప్పటికే సుమారు 35వేల మంది బీఎల్ఏలకు స్మార్ట్ఫోన్లు, ఇతర సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీరంతా టెక్-సావీగా ఉండటంతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియాశీలకంగా వ్యవహరిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరుగుండదని పార్టీ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గ ఇన్చార్జ్ లేదా ఎమ్మెల్యే తమ పరిధిలోని కనీసం 250 మంది బీఎల్ఏలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న మైండ్ గేమ్‌ను తిప్పికొట్టడంలో, ప్రభుత్వ విజయాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో ఈ నూతన వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.








