యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ ‘Moonfish’ రివ్యూ
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి భారీ స్పేస్షిప్లు, వింత ఏలియన్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విజువల్ ఎఫెక్ట్స్, చాలా స్పీడుగా సాగే యాక్షన్ సీక్వెన్సులు. కానీ, ‘మనిషి ఈ విశ్వంలో ఎక్కడ నిలబడి ఉన్నాడు? ఒంటరితనం హద్దులు దాటితే అతని మెదడు ఏం చేస్తుంది?’ అనే తాత్విక ప్రశ్నలను అడిగే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
డేనియల్ జ్వెరెఫ్ దర్శకత్వంలో వచ్చిన యానిమేటెడ్ చిత్రం ‘Moonfish’ సరిగ్గా అలాంటి ఒక ప్రయత్నమే. ఈ చిత్రం, కథ చెప్పడం కంటే ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచడానికి ప్రాధాన్యమిస్తుంది.
కథేంటి
భవిష్యత్తులో (సుమారు 500 ఏళ్ళ తర్వాత) గ్రహశకలాలపై (Asteroids) మైనింగ్ చేయడం అనేది ఒక సాధారణ ఉద్యోగం. కాసియస్, వెస్పర్ అనే ఇద్దరు వ్యోమగాములు ఒక గ్రహశకలంపైకి రాళ్లు తవ్వడానికి వెళ్తారు. కోటా పూర్తిచేస్తేనే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడే వదిలేస్తారు. వారి ప్రయాణంలో మరో చిన్న జీవి కూడా ఉంటుంది. అది ఒక గోల్డ్‌ఫిష్.
అయితే అది కేవలం పెంపుడు చేప కాదు. పాతకాలంలో గనుల్లో విషవాయువులను గుర్తించేందుకు కానరీ పక్షులను ఉపయోగించినట్టే, ఇక్కడ నీటి వ్యవస్థ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి చేపను తీసుకెళ్తారు. కానీ గ్రహశకలంపై ల్యాండింగ్ సమయంలో జరిగే ప్రమాదం తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది.
వెస్పర్ చనిపోతుంది. కాసియస్ మాత్రం అక్కడే చిక్కుకుపోతాడు.తన సహచరి మరణాన్ని తట్టుకుంటూ..అదే సమయంలో తన పని పూర్తి చేయాలి. ఈ క్రమంలో కాసియస్ రోజురోజుకూ ఒంటరిగా మారిపోతాడు. అదే పని. అదే రాళ్లు. అదే నిశ్శబ్దం. అదే చీకటి. మానవ సంబంధం పూర్తిగా లేకపోవడంతో అతని వాస్తవికత కూడా క్రమంగా దెబ్బతింటుంది.
అప్పుడు అతనికి తనతో ఉన్న గోల్డ్‌ఫిష్ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే… ఆ చేప గొంతు అతని చనిపోయిన సహచరి వెస్పర్ది. ఇది నిజమా? కాసియస్ భ్రమా? లేక ఆ గ్రహశకలంలో నిజంగా మనకు తెలియని ఏదైనా జీవం ఉందా? అనేదే ఈ సినిమా కథ.
ఎనాలసిస్
‘Moonfish’ను కేవలం ఒక స్పేస్ మైనింగ్ కథగా చూస్తే, దాని అసలు విషయం మిస్ అవుతాం. ఇక్కడ గ్రహశకలం ఒక ప్రదేశం మాత్రమే. అసలు సినిమా జరుగుతున్నది కాసియస్ మనసులో.
మనిషిని అంతరిక్షంలోకి పంపించినప్పుడు అతని దగ్గర ఆక్సిజన్, ఆహారం, టెక్నాలజీ అన్నీ ఉండొచ్చు. కానీ మనిషికి మరో మనిషి అవసరం అనే ప్రాథమిక విషయం మాత్రం టెక్నాలజీతో భర్తీ చేయలేం అని చెప్పటమే దర్శకుడు ఉద్దేశ్యం అయ్యి ఉంటుంది. కథలో వెస్పర్ మరణించిన తర్వాత కాసియస్ దగ్గర పని ఉంది, జీవించడానికి అవసరమైన వనరులు ఉన్నాయి, ఒక చేప కూడా ఉంది. కానీ అతనితో మాట్లాడటానికి ఒక మనిషి లేడు. అక్కడి నుంచే చేప కీలకంగా మారుతుంది.
చేప నిజంగా మాట్లాడుతుందా? లేక కాసియస్ మెదడు తనకు కావాల్సిన స్వరాన్ని ఆ చేపలో వింటుందా? దర్శకుడు స్పష్టమైన సమాధానం ఇవ్వడు. ఇదే సినిమాకు ఆసక్తికరమైన లేయర్. ఎందుకంటే ఒంటరితనం ఎక్కువైనప్పుడు మనిషి వాస్తవాన్ని మాత్రమే చూడడు… తన జ్ఞాపకాలతో వాస్తవాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తాడు.
అలాగే ఈ కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ అభిమానులకు వెంటనే స్టానిస్లావ్ లెమ్ రాసిన క్లాసిక్ నవల Solarisను గుర్తు చేస్తుంది. ఆ కథలో ఒక సెంటియెంట్ ప్లానెట్ ఒక వితంతు వ్యోమగామితో సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అతని జ్ఞాపకాల నుంచి చనిపోయిన భార్య రూపాన్ని తిరిగి సృష్టిస్తుంది. Moonfish అంత దూరం వెళ్లదు. ఐడియా లెవెల్ లో మాత్రం గుర్తు చేస్తుంది.
ఇక దర్శకుడు ఈ కథని నేరుగా ‘క్యాపిటలిజం చెడ్డది’ అనే సందేశంగా చెప్పడు. మనిషి ఎంత దూరం వెళ్లినా, చివరికి అతను వెతికేది ఒక ప్రదేశం కాదు. తనను ఎవరో గుర్తించే ఒక సంబంధం.అందుకే ‘Moonfish’లో ‘హోమ్’ అనే భావన చాలా అవసరంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో మరో ముఖ్యమైన విషయం..కథలో భయంకరమైన ఏలియన్ మాన్స్టర్ ఉండదు.
మనిషిని లోపల నుంచి తినేసే ఒంటరితనం అంతకు మించి భయంకరంగా ఉంటుంది.
హైలెట్స్
ప్రత్యేకమైన యానిమేషన్ స్టైల్: ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని విజువల్స్. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో, 4:3 ఫ్రేమ్ నిష్పత్తిలో, అత్యంత మినిమలిస్టిక్‌గా డిజైన్ చేసిన ఈ యానిమేషన్ ప్రేక్షకుడికి ఇరుకైన, ఒంటరితనంతో కూడిన అనుభూతిని ఇస్తుంది.
వాయిస్ యాక్టింగ్: మోర్గాన్ స్పెక్టర్, లూసీ లియు తమ గొంతులతోనే పాత్రల్లోని వేదనను, గందరగోళాన్ని అద్భుతంగా పండించారు. ముఖ్యంగా వెస్పర్కి, చేపకి రెండింటికీ లూసీ లియు వాయిస్ ఇవ్వడం కథలోని అస్పష్టతను మరింత ఆసక్తికరంగా మార్చింది.
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం: ఇది స్పీడుగా సాగే స్పేస్ థ్రిల్లర్ కాదు. డ్రామా చాలా నెమ్మదిగా, మూడ్ బేస్ చేసుకుని సాగుతుంది.
కమర్షియల్ అంశాలు లేకపోవడం: యాక్షన్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఆశించేవారికి నిరాశ తప్పదు.
అస్పష్టమైన క్లైమాక్స్: కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా ప్రేక్షకుల ఊహకే వదిలేయడం అందరికీ నచ్చకపోవచ్చు.
ఎవరికి నచ్చుతుంది?
ఆర్ట్ ఫిల్మ్స్, సైకాలాజికల్ డ్రామాలు, ప్రయోగాత్మక చిత్రాలను ఆస్వాదించేవారికి. సైన్స్ ఫిక్షన్‌ను కేవలం యాక్షన్‌లా కాకుండా ఒక కవితాత్మక కోణంలో చూడాలనుకునేవారికి.
ఫైనల్ థాట్:
‘Moonfish’ అందరినీ అలరించే రెగ్యులర్ సినిమా కాదు. కానీ నిశ్శబ్దంగా కూర్చొని, ఒక లోతైన అనుభూతిని, కొన్ని ప్రశ్నలను గుండెల్లో మోసుకెళ్లాలనుకునే ప్రేక్షకులకు ఇదొక అద్భుతమైన ప్రయోగం!
తారగణం: మోర్గాన్ స్పెక్టర్, లూసీ లియు (వాయిస్ ఓవర్లు)
దర్శకత్వం: డేనియల్ జ్వెరెఫ్
నిడివి: 89 నిమిషాలు
జానర్: యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ / సైకాలాజికల్ డ్రామా
రేటింగ్: 3/5
—సూర్య ప్రకాష్ జోశ్యుల








