ఫాంహౌస్ పాలిటిక్స్.. డిఫెన్స్‌లో బీఆర్ఎస్!?
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫాంహౌస్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ లావాదేవీలు, అక్రమ ఆస్తుల వ్యవహారాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గులాబీ నేతల ఫాంహౌస్‌ల చిట్టాను బయటపెట్టడంతో మొదలైన ఈ రాజకీయ సమరం.. ఇప్పుడు క్షేత్రస్థాయి విజిట్లతో సరికొత్త మలుపు తిరిగింది. అయితే, అధికార పక్షం దూకుడుగా విసురుతున్న ప్రశ్నల దాడికి కౌంటర్ ఇవ్వలేక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర రక్షణ ధోరణిలో పడిపోయిందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని మాజీ మంత్రులు, కీలక నేతల వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేశారు? ప్రభుత్వ, అటవీ, చెరువుల బఫర్ జోన్లలో ఎంత ఆక్రమించారు? అనే వివరాలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించింది. ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్లలో సమర్పించిన ఆస్తుల వివరాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న విలాసవంతమైన ఫాంహౌస్‌ల విస్తీర్ణానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎత్తిచూపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కేసీఆర్, కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లలో లేని భూములు, ఫాంహౌస్‌ల నిర్మాణాలు ఎలా వెలిశాయన్నది కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్న ప్రధాన అస్త్రం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా ఫాంహౌస్‌ల బాట పడుతున్నారు. ప్రతిరోజూ ఒక నేత ఫాంహౌస్ వద్దకు వెళ్లి గేట్ల ముందు నిలబడి ప్రెస్మీట్లు పెట్టడం, రికార్డులను మీడియా ముఖంగా ప్రదర్శించడం ద్వారా బీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్నారు.
కాంగ్రెస్ చేస్తున్న ఎటాక్ కు కౌంటర్ ఇవ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును కప్పిపుచ్చుకునేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నప్పటికీ, ఆ వాదన ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ లెక్కలు చూపిస్తున్నప్పుడు.. ఇదిగో మా రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇవిగో మా అనుమతులు అని ఆధారాలతో సహా తిప్పికొట్టాల్సింది పోయి, కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కావడం ఆ పార్టీకి బలహీనతగా మారుతోంది.
ఇవి కూడా చదవండి
అఫిడవిట్ల అంశంపై కాంగ్రెస్ సంధిస్తున్న సూటి ప్రశ్నలకు బీఆర్ఎస్ వద్ద స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. లీగల్ నోటీసులు ఇస్తామనో, లేక రాజకీయ కక్షసాధింపు అనో దాటవేయడం వల్ల సాధారణ ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఏ సమస్య వచ్చినా బలంగా కౌంటర్ ఎటాక్ చేసి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టే బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు తమ వ్యక్తిగత ఆస్తులు, ఫాంహౌస్‌ల వ్యవహారంపై మాత్రం గట్టి వివరణ ఇవ్వలేకపోతున్నారు.
ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో.. స్వయంగా కాంగ్రెస్ వేసిన రాజకీయ ఉచ్చులో చిక్కుకుని తన ఆత్మరక్షణ కోసమే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి రావడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బే. వరుసగా నాయకుల ఫాంహౌస్లపై దాడులు, క్షేత్రస్థాయి పరిశీలనలతో వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ అంటేనే ‘ఫాంహౌస్ పాలకుల పార్టీ’ అనే ముద్రను బలంగా ప్రజల మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది.








