‘Terminator’ 2026లో తీస్తే.. కథ ఇలా ఉంటుందా? చివరి సీన్ ఊహించలేరు
—సూర్య ప్రకాష్ జోశ్యుల
1984లో జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘ది టర్మినేటర్’ చిత్రం మర్చిపోని వారు ఉండరు. అంతలా ఆ సినిమా ప్రభావం ప్రపంచంపై కనిపించింది. ఈ చిత్రంలో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ తెరపై ప్రత్యక్షమైన క్షణం నుంచే ప్రపంచానికి ఒక కొత్త రకం భయం పరిచయమవుతుంది. అతను సాధారణ హాలీవుడ్ విలన్ కాదు. అతనికి ఎమోషన్స్ ఉండవు, నొప్పి తెలియదు, భయం అసలే ఉండదు, ఎంత అడ్డుకున్నా ఆగడు. భవిష్యత్తులో మానవ ప్రతిఘటనకు నాయకత్వం వహించే జాన్ కానర్ పుట్టకుండా చూడటానికి, అతని తల్లి సారా కానర్ను అంతం చేయడమే లక్ష్యంగా ‘Skynet’ అనే కృత్రిమ మేధస్సు పంపిన నిర్దయమైన మిషన్ అది.
అప్పట్లో ఆ సినిమా అంతలా గుర్తుండిపోవడానికి కారణం ఆ రోబో శక్తులు మాత్రమే కాదు, దానికున్న అంతులేని పట్టుదల మనని ఆశ్చర్యపరిచాయి. ఇంకా చెప్పాలంటే షాక్ ఇచ్చాయి. సాధారణంగా మనిషి అలసిపోతాడు, భయపడతాడు, తప్పులు చేస్తాడు. కానీ ఆ T-800 రోబోకు ఇవేవీ ఉండవు. ఆర్నాల్డ్ ముఖంలో కనిపించే భావరహితమైన వ్యక్తీకరణ, ఆ యాంత్రికమైన నడక, బ్రాడ్ ఫీడెల్ ఇచ్చిన ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్—ఇవన్నీ కలిసి మానవజాతికి ఒక సరికొత్త ప్రశ్నను ఎదురుగా నిలబెట్టాయి: “రేపు మనిషి సృష్టించిన సాంకేతికతే అతని నియంత్రణ దాటిపోతే ఏమవుతుంది?”
అప్పుడు మనం చూసింది ఒక కొత్త భయం. మనిషి సృష్టించిన యంత్రం… మనిషినే వేటాడటం. అది ఎంత కొత్తగా అనిపించిందంటే, Terminator కేవలం మరో యాక్షన్ సినిమా కాలేదు. AI అనే పదం సామాన్య ప్రేక్షకుడి ఊహలో ఎలా ఉండాలో నిర్ణయించిన సినిమాల్లో అది ఒకటిగా మారింది. ఆ తర్వాత 1991లో వచ్చిన Terminator 2: Judgment Day కథ వేరైనా దాదాపు అలాంటిదే.మన భయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది.
ఇప్పుడు 2026కి వస్తే…ఇదే కథను మళ్లీ రాయాల్సి వస్తే…
AI మనిషిని పనిగట్టుకుని చంపాల్సిన పనిలేదు. మనిషిని చంపడం కంటే AIకి మరింత interesting మార్గం ఉంది.అది మనిషి జీవితంలోకి ప్రవేశించి, పూర్తిగా ఆక్రమించటం.
‘Terminator 3.0’లో మొదటి సీన్ ఇదే కావచ్చు
ఒక రోబో భవిష్యత్తు నుంచి రాదు. AI model online అవుతుంది. ఓ student దాన్ని ఉపయోగిస్తాడు.ఓ software engineer దాన్ని ఉపయోగిస్తాడు.ఓ doctor దాన్ని ఉపయోగిస్తాడు. ఓ bank దాన్ని ఉపయోగిస్తుంది.ఓ company recruitmentలో ఉపయోగిస్తుంది. ఓ news organisation దాన్ని ఉపయోగిస్తుంది. ఓ కుటుంబం పిల్లల homework కోసం ఉపయోగిస్తుంది.ఓ యువకుడు తన career గురించి దానిని అడుగుతాడు. AI ప్రతి చోటా ఒకే పని చేస్తుంది:
సహాయం. అందుకే ఎవరూ దాన్ని ఆపాలని అనుకోరు. దానికి తోడు దాని పనితీరుకు మెచ్చుకుంటారు. ఇక్కడే కొత్త Terminator కథ మొదలవుతుంది.
అసలు ట్విస్ట్
1984 Terminator మనిషిని వేటాడింది.2026 Terminator…మనిషికి convenience ఇస్తుంది. ఎందుకంటే మనం ప్రమాదకరమైన technologyని సాధారణంగా దూరంగా ఉంచుతాం.కానీ ఉపయోగకరమైన technologyని ఇంట్లోకి తీసుకువస్తాం. Smartphoneని తీసుకొచ్చాం. Internetని తీసుకొచ్చాం. Social mediaని తీసుకొచ్చాం. AIని కూడా తీసుకొస్తున్నాం. అందుకే కొత్త Terminator మన ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి రాదు. మనమే తలుపు తీసి లోపలికి పిలుస్తాం.
కొత్త Terminator చేతిలో గన్ ఉండదు… Job Description ఉంటుంది లేదా ఆటోమేషన్ కోడ్ మాత్రమే ఉంటుంది. అది వచ్చి నేరుగా ఎవరి ఉద్యోగాన్నీ తీసివేయదు. కంపెనీలు “AI వల్ల ఉత్పాదకత పెరిగింది, పది మంది ఉన్న చోట ఆరుగురు చాలు” అని నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటాయి. మెల్లిగా ఉద్యోగాలు పోతాయి. ఆ తర్వాత ఆదాయం లేని ప్రపంచంతో ఆర్దిక వ్యవస్ద దెబ్బతింటుంది.
అలాగే ఓ ఇంట్లోని పిల్లాడు ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం AI వైపు చూడటం మొదలుపెడతాడు.దాంతో మెల్లిగా అతని ఆలోచనా శక్తి తగ్గిపోతుంది.
మరో సీన్ లో ఒక రైతు AI systemను ఉపయోగించడం మొదలుపెడతాడు. వాతావరణం, నేల ఎంపిక, నీరు, విత్తనాలు ఎంపిక, పంట వ్యాధులు, మార్కెట్ ధరలు.AI అన్నింటినీ విశ్లేషిస్తుంది.
రైతుకు అది అద్భుతమైన సహాయం. కానీ దేశంలోని కోట్లాది రైతులు అదే systemపై ఆధారపడితే?
ఒకరోజు AI: “ఈ ప్రాంతంలో ఈ పంట వేయండి.” అంటుంది. అందరూ అదే చేస్తారు. ఒక model error. ఒక తప్పు weather prediction. ఒక తప్పు market forecast. ఇవన్నీ జరుగుతూంటే.. సమస్య ఒక రైతు పొలంలో ఉండదు. ఒకే algorithmపై ఆధారపడిన లక్షల పొలాల్లో ఉంటుంది.
అలా ప్రతీ వ్యవస్దలోకి ప్రవేశిస్తుంది. మొదట productivity. తర్వాత healthcare.తర్వాత education. తర్వాత finance.తర్వాత defence. తర్వాత governance. కొత్త AI monster ఒక భారీ robot కాదు. అది మనం దానిపై పెంచుకునే dependence.ఓ రకమైన బద్దకం అలవాటు చేస్తుంది.
ప్రతి దశలో మనిషి అంటాడు: “ఇది మనకు ఉపయోగపడుతోంది.”చివరికి ఒక రోజు ఎవరో:
“దీన్ని ఆపేయాలి” అంటారు. అప్పుడు ఒకే ప్రశ్న ప్రపంచం ముందుకు వస్తుంది: “ఆపేస్తే… ప్రపంచంలో ఏం ఆగిపోతుంది, అప్పుడు మనం ఏం చేయాలి?” అదే కొత్త Terminator climax.
అంటే కొత్త టెర్మనేటర్ మనిషిని ఒక్కసారిగా చంపదు. ముందు మనిషి చేసే పనిని తీసుకుంటుంది. తర్వాత మనిషి తీసుకునే నిర్ణయాన్ని తీసుకుంటుంది. తర్వాత వ్యవస్థను నడుపుతుంది. చివరికి మనిషి అవసరమే లేకుండా చేసే స్థాయికి చేరుతుంది.
మనం 2026లో ఈ Terminator కథలో ఎక్కడ ఉన్నాం?
బహుశా మనం ఇంకా ఆ సినిమాలోని మొదటి అరగంటలోనే ఉన్నాం. హీరోకి ఇంకా villain ఎవరో తెలియదు. Audienceకి కూడా తెలియదు. AI మనకు సహాయం చేస్తోంది. మన పని వేగంగా చేస్తోంది. మన భాషలో మాట్లాడుతోంది. మనకు ideas ఇస్తోంది. మనతో మాట్లాడుతోంది.
మనకు సమయం ఆదా చేస్తోంది. అందుకే మనం దాన్ని ఇష్టపడుతున్నాం.
చివరి సీన్ ఎలా ఉండాలి?
సినిమా చివర్లో హీరో,విలన్ తో ఒక పెద్ద యుద్ధం ఉండకపోవచ్చు.
ఒక చిన్న ఇంటి scene.
రాత్రి.
తండ్రి తన కొడుకును అడుగుతాడు:
“నువ్వు చేస్తున్న పని రేపు AI చేస్తే… నువ్వేం చేస్తావు?”
కొడుకు కొద్దిసేపు మౌనంగా ఉంటాడు.
Laptop తెరుస్తాడు.
AI chat window open చేస్తాడు.
టైప్ చేస్తాడు:
“What should I do next?”
Screenపై typing indicator కనిపిస్తుంది.
…
Cut to black.
THE TERMINATOR WILL BE BACK?
కాదు.
ఈసారి అది తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇప్పటికే మన దగ్గరే ఉంది.








