రూ.1,500 కోట్ల పనులకు శ్రీకారం.. పిఠాపురం అభివృద్ధి పై పవన్ ప్రత్యేక ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత సోమవారం ఆయన పిఠాపురంలో పర్యటించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సుమారు రూ.1,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు.
పర్యటనలో భాగంగా ఫకృద్ధీన్ పాలెం (Fakruddin Palem)లో అభివృద్ధి చేసిన మైసమ్మ చెరువును పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (Pradhan Mantri Krishi Sinchayee Yojana) కింద సుమారు రూ.73 లక్షలతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో సాధారణ నీటి వనరుగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. చెరువు గట్టు వెంట వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల కోసం పార్క్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం, నడకకు అవకాశం ఏర్పడింది.
అక్కడ ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయ భవనం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పనితీరును పరిశీలించారు. కాకినాడ (Kakinada) ప్రాంతంలో ఆధునీకరించిన 14 చెరువులకు సంబంధించిన ఫొటో గ్యాలరీని కూడా వీక్షించారు. నీటి వనరుల సంరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే అంశంపై అధికారులు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించారు.
జాతీయ రహదారి పక్కన నిర్మించిన పీఠికాపురవనం (Peethikapuravanam) ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునికంగా అభివృద్ధి చేసిన ఈ ప్రదేశాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అలాగే అగ్రహారం (Agraharam)లో అపోలో హాస్పిటల్ (Apollo Hospitals) సహకారంతో నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. చిన్నారులకు మెరుగైన వాతావరణంలో ప్రాథమిక సంరక్షణ, విద్య అందించేందుకు అనువుగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
చందుర్తి రోడ్డు (Chandurthi Road) అభివృద్ధి పనులను కూడా పవన్ కల్యాణ్ పరిశీలించారు. నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
పర్యటనలో భాగంగా ఆర్ఆర్బీహెచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (RRBH Government Junior College) మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలోనూ పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. మొత్తంగా పిఠాపురం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పలు రంగాల్లో పనులు కొనసాగుతున్నాయి. చెరువుల అభివృద్ధి నుంచి రహదారులు, అంగన్వాడీలు, ప్రజా సౌకర్యాల వరకు విస్తృత స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు స్థానిక అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.








