జిన్‌పింగ్.. ట్రంప్‌ను భయపెట్టడానికి ఈ పదం వాడారా? లేక ఒక Deal Offer చేశారా?
ట్రంప్, జిన్‌పింగ్ కలిసినప్పుడు ప్రపంచం మొత్తం వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా చూపించింది. అందులో వింతా లేదు. ఎందుకంటే అమెరికా–చైనా మధ్య వాణిజ్య పోరు ఉంది. టెక్నాలజీపై పోటీ ఉంది. తైవాన్ విషయంలో విభేదాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండాలనే పోటీ కూడా ఉంది. అలాంటి సందర్బంలో, సమయంలో జిన్‌పింగ్… ట్రంప్ ముందు ఒక విచిత్రమైన పదాన్ని తీసుకొచ్చారు. అదే చర్చనీయాంశమైంది.
ఆ పదం వినగానే అమెరికా–చైనా సంబంధాల గురించి మాట్లాడుతున్న చర్చ ఒక్కసారిగా వైట్ హౌస్ నుంచి వేల సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది. ఆ పదం ఏమిటి, దాని వెనక ఉన్న కథ ఏమిటి..అసలు ట్రంప్ తో జిన్‌పింగ్ ఆ పదం వాడటం వెనక కథ ఏమిటనే చర్చలు అంతటా జరుగుతున్నాయి. ఓ రకంగా ఈ పదం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ డిబేట్.
“Thucydides Trap.”
ఈ పదాన్నే జిన్‌పింగ్ వాడారు. వినడానికి ఇదేదో పెద్ద చరిత్ర పుస్తకంలోని పదంలా అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న విషయం మాత్రం చాలా సింపుల్. ఒక దేశం వేగంగా ఎదుగుతుంటే, ఇప్పటికే ప్రపంచంలో బలంగా ఉన్న మరో దేశానికి భయం మొదలవుతుంది. ఆ భయం, పోటీ చివరకు గొడవగా మారే ప్రమాదం ఉంటుంది.
జిన్‌పింగ్ ట్రంప్‌కు ఇదే విషయం గుర్తు చేశారా? లేక… “మనిద్దరం గొడవ పడకుండా కొత్తగా కలిసి ముందుకు వెళ్లొచ్చు” అని ఒక రకమైన Dealనే సూచించారా? ఇదే అసలు ఇంట్రస్టింగ్ మేటర్.
రెండున్నర వేల ఏళ్ల నాటి పదం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది?
ఈ పదానకి చాలా గత చరిత్ర ఉంది. Thucydides అనే గ్రీకు చరిత్రకారుడు సుమారు 2,500 ఏళ్ల క్రితం జరిగిన ఒక యుద్ధం గురించి రాశారు. అప్పుడు Athens అనే నగరం వేగంగా బలపడుతోంది. మరోవైపు Sparta అప్పటికే బలమైన శక్తిగా ఉంది. ఒకరు పైకి వస్తున్నారు. మరొకరు తమ స్థానం పోతుందేమోనని చూస్తున్నారు. ఇద్దరి మధ్య అనుమానం, పోటీ పెరిగింది. చివరకు అది యుద్ధానికి దారితీసింది.
చాలా సంవత్సరాల తర్వాత Harvard రాజకీయ శాస్త్రవేత్త Graham Allison ఈ చరిత్రను తీసుకుని ఒక ప్రశ్న వేశారు: “కొత్తగా ఎదుగుతున్న శక్తి, ఇప్పటికే బలంగా ఉన్న శక్తిని సవాలు చేసినప్పుడు గొడవ తప్పదా?” ఈ ఆలోచనకే “Thucydides Trap” అనే పేరు వచ్చింది.
ఇప్పుడు ఈ కాలంలో Athens ఎవరు? Sparta ఎవరు?
ఇక్కడే ఈ పాత చరిత్ర కథకు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలతో లింక్ వస్తుంది. ఒకవైపు అమెరికా. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి, టెక్నాలజీలో చాలా కాలంగా అగ్రస్థానంలో ఉన్న దేశం. మరోవైపు చైనా. గత కొన్ని దశాబ్దాల్లో ఆర్థికంగా, టెక్నాలజీలో, సైనికంగా చాలా వేగంగా ఎదిగిన దేశం.
అంటే… ఒక దేశం ఇప్పటికే బలంగా ఉంది. మరో దేశం ఆ బలాన్ని అందుకునే స్థాయికి వస్తోంది. ఇక్కడి నుంచే అసలు టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే చైనా ఎదుగుదల అమెరికాకు కేవలం చైనా ఎదుగుదలగా కనిపించదు. అది భవిష్యత్తులో అమెరికా ప్రభావానికి సవాలుగా కూడా కనిపించవచ్చు.
అదే సమయంలో చైనాకు మాత్రం మరో ఆలోచన ఉండొచ్చు. “మేం ఎదుగుతున్నాం. మరి మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి?” ఈ రెండు ఆలోచనలు ఎదురెదురుగా వచ్చినప్పుడు సమస్య మొదలవుతుంది. ఇదే కారణంగా “Thucydides Trap” అంత ప్రమాదకరమైన పదంగా కనిపిస్తోంది.
మరి జిన్‌పింగ్ ట్రంప్‌ను భయపెట్టాలనుకున్నారా?
జిన్‌పింగ్ ఈ పదాన్ని ఉపయోగించి “యుద్ధం వస్తుంది” అని చెప్పడం లేదు. చైనా వైపు నుంచి వస్తున్న సందేశం వేరుగా ఉంది. అమెరికా, చైనా పోటీ పడుతున్నా, ఇద్దరి మధ్య ఘర్షణ తప్పనిసరి కాదు. రెండు దేశాలు ఒకరినొకరు గౌరవించుకుని కలిసి పనిచేయవచ్చని, “win-win cooperation” సాధ్యమేనని చైనా చెబుతోంది. అంటే జిన్‌పింగ్ చెప్పిన మాటను ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు: “మనిద్దరం ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. చరిత్రలో జరిగిన తప్పును మళ్లీ చేయకూడదు.” అని.
జిన్‌పింగ్‌కు అసలు కావాల్సింది ఏంటి?
చైనా కేవలం టారిఫ్‌లు తగ్గించాలని లేదా వాణిజ్య సమస్యలు పరిష్కరించాలని మాత్రమే కోరుకుంటోందని ఈ మాటలతో చెప్పడం కష్టం. జిన్‌పింగ్ చాలా పెద్ద విషయాన్ని మాట్లాడుతున్నారు. అమెరికా–చైనా సంబంధం ఎలా ఉండాలి?, చైనా ఎప్పటికీ అమెరికా కంటే వెనుక ఉన్న దేశంగానే ఉండాలా?, లేక అమెరికాతో సమాన స్థాయిలో ప్రపంచ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే పెద్ద శక్తిగా ఉండాలా? అనేదే ఆయన మాటల్లో అసలు విషయం. జిన్‌పింగ్ గతంలో “కొత్త రకమైన ప్రధాన దేశాల సంబంధం” గురించి కూడా ప్రశ్నించారు. ఓ రకంగా ఇది ఒక చిన్న Trade Deal కంటే పెద్ద విషయం.
ప్రపంచంలో చైనా స్థానాన్ని అమెరికా ఎలా చూస్తుంది?
జిన్‌పింగ్ ఈ మాటను ఇప్పుడే మొదటిసారి చెప్పలేదు. ఇది కూడా గమనించాల్సిన విషయం. జిన్‌పింగ్ 2014 నుంచే Thucydides Trap గురించి మాట్లాడుతున్నారు. 2024లో పెరూలో జరిగిన APEC సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా ఆయన ఇదే భావనను ప్రస్తావించారు. అంటే ట్రంప్‌ను చూసిన వెంటనే గుర్తొచ్చిన కొత్త పదం కాదు. చైనా–అమెరికా సంబంధాన్ని చైనా నాయకత్వం ఎలా చూస్తుందో చెప్పడానికి ఈ పదాన్ని చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు.
యుద్దం తప్పదా
ఇద్దరు ప్రపంచ దేశాథినేతలు మథ్య దొర్లిన ఓ పదం వెనుక ఉన్న విషయాలను అర్దం చేసుకునే ప్రాసెస్ లవో మనకు వచ్చేది ఒకటే సందేహం. నిజంగా ఇప్పటి పరిస్థితులు యుద్ధానికే దారితీస్తాయా? అని. అయితే ప్రతి పవర్ ఛేంజ్ యుద్ధంతో ముగియలేదు.అమెరికా ప్రపంచంలో బ్రిటన్ స్థానాన్ని అధిగమించినప్పుడు పెద్ద యుద్ధం జరగలేదు. అమెరికా–సోవియట్ యూనియన్ మధ్య దశాబ్దాల పాటు తీవ్ర పోటీ ఉన్నా, అది నేరుగా పూర్తి స్థాయి యుద్ధంగా మారలేదు. అందుకే Thucydides Trap అంటే “యుద్ధం ఖాయం” అని అర్థం కాదు. అది ఒక హెచ్చరిక మాత్రమే.
ఫైనల్ గా…
జిన్‌పింగ్ ట్రంప్ ముందు ఉంచింది కేవలం రెండు పదాల చరిత్ర పాఠం కాదు. అమెరికా-చైనాల భవిష్యత్తు ఎలా ఉండాలనే ఒక పెద్ద ప్రశ్న. “చైనా ఎదుగుతోంది, దాన్ని మీరు ఆపలేరు. కానీ ఈ పోటీని యుద్ధం వరకు తీసుకెళ్లకుండా డీల్ చేసుకుందాం” అనే స్పష్టమైన సందేశం ఇందులో ఉంది. దానికి ట్రంప్ ఎలా స్పందిస్తారు, వేగంగా ఎదుగుతున్న చైనాను చూసి అమెరికా తన వ్యూహాలను ఎలా మార్చుకుంటుందనే దానిపైనే మన ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








