ఆస్ట్రల్ పైప్స్ వైస్ ప్రెసిడెంట్ అల్కేష్ పంచల్ తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
అహ్మదాబాద్ (గుజరాత్): పైపులు, వాటర్ ట్యాంకులు, పెయింట్లు, నిర్మాణ రసాయనాల తయారీలో పేరుపొందిన ఆస్ట్రల్ పైప్స్ లిమిటెడ్ (Astral Pipes Limited) వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) అల్కేష్ పంచల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. వేగవంతమైన అనుమతులతోపాటు ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. అల్కేష్ పంచల్ స్పందిస్తూ… తమ సంస్థకు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణా, ఒడిస్సా తదితర రాష్ట్రాల్లో 13 ప్లంబింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. అగ్రశ్రేణి పైపుల తయారీ సంస్థగా ఉన్న తమకు దేశవ్యాప్తంగా సుమారు 4వేలమంది డిస్ట్రిబ్యూటర్లు, 2.7లక్షలమంది డీలర్లు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అల్కేష్ పంచల్ చెప్పారు.








