విశాఖపట్నంలో గ్రీన్ ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
చిరిపాల్ గ్రూప్ ఎండి బ్రిజ్ మోహన్ తో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): టెక్స్ టైల్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్స్ రంగాల్లో పేరెన్నికగన్న చిరిపాల్ గ్రూప్ (Chiripal Group) మేనేజింగ్ డైరక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్, గ్రూప్ అనుబంధ సంస్థ గ్రూ సోలార్ సిఇఓ వినయ్ థదానితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, రోడ్లు, విధానపరమైన మద్దతును పరిగణనలోకి తీసుకొని గ్రీన్ ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరం అత్యుత్తమమైన కనెక్టివిటీతోపాటు అన్నివిధాలా అనుకూలతలు కలిగి ఉందని చెప్పారు. చిరిపాల్ గ్రూప్ ఎండి బ్రిజ్ మోహన్ చిరిపాల్ మాట్లాడుతూ… తమ సంస్థ ఉత్పత్తులైన వస్త్రాలు (నందన్ డెనిమ్, విశాల్ ఫ్యాబ్రిక్స్, నందన్ టెర్రీ), ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు (చిరిపాల్ పాలీ ఫిల్మ్స్), సోలార్ (GREW), రసాయనాలు 52కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమకు తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్యూ&కాశ్మీర్ లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. టైర్ల తయారీ యూనిట్ కు సంబంధించి ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.








