విశాఖ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి లోకేష్
ఎస్ టి టెలీమీడియా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనాతో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): డేటా సెంటర్లు (STT GDC), కమ్యూనికేషన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీలో పేరుపొందిన ఎస్ టి టెలిమీడియా (ST Telemedia, Singapore) సంస్థ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనా (స్ట్రాటజీ & సస్టైనబిలిటీ), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (గ్లోబల్ డేటాసెంటర్స్, ఇండియా) లలిత్ టి.కన్నాలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటికే గూగుల్ పనులు ప్రారంభించగా, రిలయన్స్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని చెప్పారు. ఎస్ టి టెలీమీడియా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనా మాట్లాడుతూ… తమ సంస్థ ఇప్పటికే 10 ప్రధాన నగరాల్లో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను నిర్వహిస్తోందని చెప్పారు. తమకు మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి వెయ్యికి పైగా కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.








