అరికెపూడి గాంధీకి ఈడీ ఉచ్చు!
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాహితి ఇన్ఫ్రాటెక్ చేపట్టిన ప్రాజెక్టుల మోసాల దర్యాప్తులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్ఫ్రా మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
సాహితి ఇన్ఫ్రా కంపెనీ అనేక అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి సుమారు 2.1 కోట్లు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించబడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలకు అసలు ఉద్దేశం ఏమిటి? వాటి వెనుక ఉన్న వ్యాపార సంబంధాలు లేదా చట్టబద్ధత ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు సంస్థ లోతుగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని గాంధీని ఈడీ ఆదేశించింది.
ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన మూలం సాహితి ఇన్ఫ్రా మోసాలే. గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు నిర్మిస్తామని సంస్థ ప్రచారం చేసింది. అయితే బాధితుల నుంచి వందల కోట్లు వసూలు చేసినప్పటికీ, ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయకుండా చేతులెత్తేసింది. తొలుత సుమారు 248 కోట్లతో ప్రారంభమైన ఈ చీటింగ్ కేసుల దర్యాప్తు, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యేసరికి ఈ మొత్తం ఏకంగా 842 కోట్లకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సంధు పుర్ణచంద్రరావు తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇందులో లక్ష్మీనారాయణను సెప్టెంబర్ 2024లోనే ఈడీ అరెస్ట్ చేసింది.
ఈ దర్యాప్తు కేవలం రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక నేరాలకే పరిమితం కాలేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల ప్రమేయంపై కూడా దృష్టి సారించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సంస్థాగతంగా నిధులు ఎలా మళ్లించబడ్డాయి? అందిన సొమ్ము ఎటు వెళ్లింది? అనే విషయాలపై ఈడీ కూపీ లాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు, సుమారు 161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అంతేకాకుండా.. కంపెనీ ప్రకటనలలో నటించిన సినీ నటుడు జగపతి బాబును కూడా సాక్షిగా విచారించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రస్తుతం అరికెపూడి గాంధీకి వచ్చిన ఈడీ నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27న జరగనున్న విచారణలో ఈడీ అధికారుల ఎదుట గాంధీ ఇచ్చే వివరణ.. ఆ తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.








