ఒకప్పుడు పీజేఆర్ కంచుకోట ఖైరతాబాద్!
తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ చరిత్ర, గత రాజకీయాలు, ఓటర్ల నాడి తెలుసుకోవాలనుకోవడం సహజం.
ఖైరతాబాద్ ఎన్నికల చరిత్ర 1967లో ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.వి.గురుమూర్తి విజయం సాధించగా, ఆ తర్వాత 1972లో నాగం కృష్ణారావు గెలుపొందారు. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకే ఒక్క దిగ్గజ నాయకుడి హవా దశాబ్దాల పాటు నడిచింది. ఆయనే దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్). పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1978, 1985, 1989, 1994 సంవత్సరాల్లో ఖైరతాబాద్ నుండి నాలుగుసార్లు ఘన విజయం సాధించారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కోటగా మలిచారు. 1983లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి ఎం. రామచందర్ రావు చేతిలో పీజేఆర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పీజేఆర్ 48.3 శాతం ఓట్లతో మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 1999లో కె.విజయ రామారావు దాదాపు 50 శాతం ఓట్లతో టీడీపీ తరఫున గెలుపొందగా, 2004లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుని 53.4 శాతం ఓట్లతో విజయం సాధించింది.
2008లో పీజేఆర్ అకస్మాత్తుగా మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి 67 శాతం ఓట్లతో సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో ఖైరతాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలను విడదీశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ 39.1 శాతం ఓట్లతో విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఖైరతాబాద్ రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకానొక దశలో ఏకపక్షంగా ఉన్న ఈ నియోజకవర్గం, క్రమంగా మూడు పార్టీల మధ్య తీవ్రమైన పోటీకి అడ్డాగా మారింది. 2014 తొలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 37.3 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ను ఓడించి సంచలనం సృష్టించారు.
ఇవి కూడా చదవండి
అయితే 2018 రాజకీయ సమీకరణాల్లో భాగంగా దానం నాగేందర్ కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి దాదాపు 45 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇక 2023 శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దానం నాగేందర్ 43.48 శాతం ఓట్లతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పి.విజయారెడ్డి 29.28 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలగా, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 24.59 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో రానున్న ఉప ఎన్నిక రాజకీయంగా అత్యంత రసవత్తరంగా మారనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాలి.








