అంబటి రాంబాబును వెంటాడుతున్న ఈడీ..!
త వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయనకు స్పష్టం చేశారు.
మద్యం రవాణా కేసులో అంబటి రాంబాబును విచారణ సెగ గట్టిగానే వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మొదటగా సెప్టెంబర్ 18న అంబటి రాంబాబుకు తొలిసారిగా ఈడీ నోటీసులు వెళ్లాయి. సెప్టెంబర్ 24న తమ ముందు హాజరుకావాలని అధికారులు అందులో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, పాత తేదీలతో ఉన్న నోటీసులు పంపారంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
చట్టపరమైన సలహా తీసుకునేందుకు వీలుగా తనకు కొత్త నోటీసు ఇవ్వాలని ఆయన కోరారు. అంబటి రాంబాబు అభ్యర్థన మరియు మునుపటి గడువు ముగిసిన నేపథ్యంలో, ఈడీ అధికారులు సెప్టెంబర్ 24న మరోసారి నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 25న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. మద్యం డిపోల నుండి షాపులకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టును దక్కించుకున్న కొంతమంది వైఎస్సార్సీపీ నేతలతో మాజీ మంత్రికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.
టెండర్ల నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వం నిర్దేశించిన రవాణా రేట్లను భారీగా పెంచడం ద్వారా కోట్ల రూపాయల నిధులు దారిమళ్లాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన వ్యక్తిగత బ్యాంక్ లావాదేవీల వివరాలు, ఆస్తుల పత్రాలతో సహా విచారణకు రావాలని ఈడీ అధికారులు అంబటి రాంబాబును ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఈడీ, అంబటి రాంబాబు విచారణ ద్వారా మరిన్ని కీలక రహస్యాలను ఛేదించాలని భావిస్తోంది.








