ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కాంగ్రెస్కు అగ్నిపరీక్ష!
తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు పడడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇది సరికొత్త రాజకీయ అవకాశాన్ని ఇస్తోంది.
2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఫిరాయింపుల చట్టం వల్ల ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో జరగబోయే ఉపఎన్నిక కేవలం ఒక స్థానానికి పరిమితం కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచుకోవడానికి, అలాగే బీఆర్ఎస్ బలమైన పునాదులను దెబ్బతీయడానికి కాంగ్రెస్కు ఇది పెద్ద అవకాశంగా చెప్పవచ్చు.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో దానం నాగేందర్ మరోసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే, కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రయోజనాలను కల్పించే అవకాశం ఉంది. ఒకటి.. హైదరాబాద్ నగరానికి రాష్ట్ర మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం లభిస్తుంది. రెండు.. మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం కేబినెట్లో ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. కొండా సురేఖ తొలగింపు తర్వాత తలెత్తిన రాజకీయ శూన్యతను పూడ్చడానికి ఈ పరిణామం ఉపయోగపడవచ్చు.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఈ ఉపఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పెద్ద పరీక్షగా నిలవనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగరంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్,, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అయినా.. హైదరాబాద్ రాజకీయాలపై పట్టు సాధించాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి ఉంది.
మరోవైపు.. గతంలో బీఆర్ఎస్తో ఎన్నికల అవగాహన కలిగి ఉన్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలు అంశాల్లో సమర్థిస్తోంది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య.. ఖైరతాబాద్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది.. అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ.. ఖైరతాబాద్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలకడం ఖాయం.








