ఖైరతాబాద్ ఉప ఎన్నిక: బలమైన అభ్యర్థి వేటలో బీఆర్ఎస్
తెలంగాణలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఈ ఉపఎన్నిక సరైన అవకాశంగా పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కేడర్‌లో జోష్ నింపేలా, ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తన జోరు చూపించింది. కానీ ఖైరతాబాద్ ఉపఎన్నిక మాత్రం వాటికి భిన్నం. అందుకే ఇక్కడ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలాలు, బలహీనతలపై ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించిన అధిష్టానం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునే ప్రణాళికలను రచిస్తోంది.
ఖైరతాబాద్ బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ నుంచి పలువురు ప్రముఖుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత, పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న సాయికిరణ్ యాదవ్‌ను ఖైరతాబాద్ నుంచి బరిలోకి దింపితే యువత ఓట్లు ఆకట్టుకోవచ్చని పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా, ఈ నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం అన్ని బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న సీనియర్ నేత మానే గోవర్ధన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన.. అప్పటి నుంచి స్థానికంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. అలాగే వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న ఆయన సతీమణి మానే కవితా రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని త్యాగం చేసిన పి.జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత పీజేఆర్ కుటుంబానికి స్థానికంగా ఉన్న ఆదరణ, అనుబంధం తమకు లాభిస్తుందని గులాబీ దళం అంచనా వేస్తోంది. అలాగే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం, అభ్యర్థి ఎంపికలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. అన్ని సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకుల మద్దతును బేరీజు వేసుకుంటూ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థిని వీలైనంత త్వరగా ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. మొత్తానికి ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.








