ఏపీని వాటర్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు సహకరించండి : మంత్రి లోకేష్
దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీని గమ్యస్థానంగా మారుస్తాం
ఇండోర్ క్రికెట్ అకాడమీలకు సాంకేతిక సహకారం, నిధులివ్వండి
ఐసిసి అధ్యక్షుడు జై షా తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలు
అహమ్మదాబాద్ (గుజరాత్): ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ జై షా తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహమ్మదాబాద్ లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఐసిసి ఛైర్మన్‌గా అంతర్జాతీయ క్రికెట్ ను విజయవంతంగా నడుపుతున్నందుకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించడం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ప్రారంభించడం, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం అందించడంలో జై షా సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానిస్తూ, ఆంధ్రప్రదేశ్ ను నేషనల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఒలింపిక్ ఈవెంట్ లకు, ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ కు (సెయిలింగ్, రోయింగ్, విండ్సర్ఫింగ్, ఓపెన్-వాటర్ స్విమ్మింగ్, బీచ్ వాలీబాల్) విశాఖపట్నాన్ని సహ-ఆతిథ్య గమ్యస్థానంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. అమిత్ షా ప్రారంభించిన గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ (GPL) స్ఫూర్తితో, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడానికి… ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇటీవల 128 స్థానిక జట్లను భాగస్వామ్యం చేస్తూ మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని మంత్రి లోకేష్ ప్రస్తావించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), జాతీయ జట్టులో మెరుగైన క్రీడాకారిణుల కోసం మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మంగళగిరిలో ఇటీవల మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) ప్రారంభించి, తొలి టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. WPL లీగ్‌లు, జాతీయ మహిళల శిబిరాలు, దేశీయ టోర్నమెంట్లను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రత్యేక గమ్యస్థానంగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, క్రీడల్లో బాలికల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన ప్రవేశపెట్టిన ‘షీ ప్లేస్’ కార్యక్రమం వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. టైర్-2 , టైర్-3 ప్రతిభను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ఇండోర్ క్రికెట్ శిక్షణా అకాడమీలను నిర్మించడానికి BCCI నుండి సాంకేతిక మార్గదర్శకత్వం, నిధులను అందించాల్సిందిగా జై షాను మంత్రి లోకేష్ కోరారు.








