మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరితో మంత్రి లోకేష్ భేటీ
స్టార్టప్ ల ప్రోత్సాహానికి ఆర్ టిఐహెచ్ లో భాగస్వామ్యం వహించండి
న్యూఢిల్లీ: ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్. (యుఎస్ఎ) వైస్ ప్రెసిడెంట్ & గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో భూమి లభ్యత, ఐటీ & జీసీసీ పాలసీ మద్దతుతో ఒక జీసీసీ / టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం వహించి, వాటిని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)లో ఫిన్‌టెక్ సలహాదారు సభ్యునిగా చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో సీఎస్ఆర్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, పీ4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా విన్నవించారు. మాస్టర్‌కార్డ్ తన ‘ప్రైస్‌లెస్ ఎక్స్పీరియన్స్’ను రాజమండ్రి, కోనసీమ ప్రాంతంలో అమలు చేసింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ చొరవకు సహకరించిన తొలి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పర్యాటక, పర్యావరణ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. మాస్టర్ కార్డు వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరి మాట్లాడుతూ… భారత్ లో పూణే, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, వడోదరలో కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాస్టర్ కార్డ్ 2వేలమంది ఉద్యోగులను కలిగి ఉందని తెలిపారు. 6వేలమంది టెక్నాలజిస్టులతో ప్రపంచంలో అతిపెద్ద టెక్ హబ్ ను పూణేలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్త “ప్రైస్‌లెస్” ప్లాట్‌ఫామ్ ద్వారా దిండి, తిరుపతి, సూర్యలంక, అరకు/వైజాగ్‌లను ప్రోత్సహించడానికి ఏపీ టూరిజం అథారిటీతో ఎంఓయు చేసుకున్నట్లు చెప్పారు. ఎపి ప్రభుత్వ తాజా ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అన్నారు.








