శాప్ (SAP) వైస్ ప్రెసిడెంట్ లవ్నీష్ చనానాతో మంత్రి లోకేష్ భేటీ
ఎపిలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్, క్లౌడ్, బిజినెస్ ఎఐ అభివృద్ధి సంస్థ శాప్ (SAP) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్నీష్ చనానాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ గవర్నెన్స్, ఎస్ఎంఇ డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి కోసం శాప్ ఆధ్వర్యాన డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు SAP నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ తో కలిసి పనిచేయాలని అన్నారు. శాప్ (SAP) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చనానా స్పందిస్తూ… భారత్ లో ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), బ్యాంకులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు తాము సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. SAP ల్యాబ్స్ ఇండియా — ప్రపంచవ్యాప్తంగా SAP రెండవ అతిపెద్ద R&D హబ్ అభివృద్ధి చేస్తోందని, ఇది గ్లోబల్ ప్రొడక్ట్, బిజినెస్ AI విడుదలకు దోహదపడుతుందని తెలిపారు. బెంగళూరులో కొత్తగా 15వేల సీట్లతో R&D, ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.








