అమెరికా లో జర్నలిస్టులపై నిషేధం .. రాజ్యాంగ విరుద్ధం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి అమెరికా కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పాలిటికో మీడియా సంస్థల జర్నలిస్టులకు వైట్‌హౌస్ ప్రవేశాన్ని నిషేధించిన నిర్ణయాన్ని ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేశారు. ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే ప్రెస్ పాసులు పునరుద్ధరించాలని ఆదేశించారు. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 18న ట్రంప్ ప్రకటించిన నిషేధాన్ని సవాలు చేస్తూ ఈ మూడు సంస్థలు దాఖలు చేసిన దావాలో ఈ తీర్పు వెలువడింది. 14 రోజుల పాటు నిషేధాన్ని అమలు చేయవద్దని, ప్రెస్ పాసులు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.జాతీయ భద్రత కారణాలతో నిషేధం విధించినట్లు ప్రభుత్వం వాదించినా, దానికి ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ స్వయంగా ఈ మీడియా సంస్థలు ‘అబద్ధాలు, నెగిటివ్ రిపోర్టింగ్’ చేస్తున్నాయని చెప్పి నిషేధించారని పేర్కొన్నారు.
ఫస్ట్ అమెండ్మెంట్ కింద ప్రెస్ స్వేచ్ఛకు భంగం కలిగిందని, డ్యూ ప్రాసెస్ లేకుండా నిషేధం విధించారని జర్నలిస్టులు వాదించారు. ఈ న్యాయపోరాటం నవంబర్ 3న జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికలకు కొన్ని వారాల ముందు వచ్చింది. ప్రెస్ ఫ్రీడమ్ సంస్థలు, అనేక మీడియా గ్రూపులు ఈ మూడు సంస్థలకు మద్దతు ప్రకటించాయి.








