ఎపిలో గోద్రెజ్ ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… గోద్రెజ్ అనుబంధ సంస్థల్లో ఒకటైన అజ్టెక్ లైఫ్‌సైన్సెస్ ఆధ్వర్యాన ఒక ఆగ్రో కెమికల్ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. రెడీ టు ఈట్ పాల ఉత్పత్తుల కోసం ఎపిలో ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, సమాధాన్ కేంద్రాలను విస్తరించడానికి గోద్రెజ్ ఆగ్రోవెట్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి స్పందిస్తూ… గోద్రెజ్ & బాయిస్ గృహోపకరణాలు, ఇంటెరియో ఫర్నిచర్, తాళాలు, పారిశ్రామిక పరికరాల తయారీ, ఇస్రో/డిఆర్డిఓ ఏరోస్పేస్ విడి భాగాల తయారీ రంగంలో సేవలందిస్తున్నట్లు చెప్పారు.
కొత్తగా పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం, ఇంటిరియో ద్వారా 2లక్షల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పెట్‌కేర్ శ్రేణి (GCPL), రుణాల కోసం గోద్రెజ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ పామ్ ప్రాసెసర్ గా ఉందని అన్నారు. గత ఏడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ లో గోద్రెజ్ ఆగ్రోవెట్, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, సమాధాన్ కేంద్రాల ఏర్పాటు కోసం రూ.70 కోట్ల విలువైన ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు చెప్పారు. ద్వారకా తిరుమల మండలంలో రూ. 210 కోట్ల పెట్టుబడితో మిఠాయి, కోకో బటర్ ప్రత్యామ్నాయ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎపి ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాకేష్ స్వామి చెప్పారు.








