అమెరికన్‌ను తీసేసి Indian కి ఉద్యోగం ఇచ్చారా? ఇక Trump టార్గెట్ ఆ కంపెనీయే?!
అమెరికాలో ఒక కంపెనీ తన దగ్గర పనిచేస్తున్న అమెరికన్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేసింది (Layoff). ఆ తర్వాత కొన్ని రోజులకే అదే కంపెనీలో ఒక కీలకమైన పోస్టు ఖాళీ అయితే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక H-1B ఉద్యోగిని నియమించుకోవాలని అనుకుంది. ఇప్పటివరకు ఇలాంటి విషయాలను అమెరికా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఇకపై ఈ రెండింటినీ వేర్వేరు ఘటనలుగా చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.
తాజాగా ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ప్రోగ్రామ్‌పై తీసుకున్న నిర్ణయం ఐటీ రంగాన్ని ఊపేస్తోంది. ఇకపై ఏదైనా కంపెనీ H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ కంపెనీ గత ఏడాది కాలంలో అదే తరహా ఉద్యోగాల్లో ఉన్న అమెరికన్ కార్మికులను ఏమైనా తొలగించిందా? లేదా రాబోయే రోజుల్లో అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంటే, కేవలం దరఖాస్తు చేసిన ఉద్యోగికి అర్హతలు ఉన్నాయా లేదా అని మాత్రమే చూడకుండా, ఆ ఉద్యోగం వెనుక కంపెనీ తీసుకున్న ‘లేఆఫ్’ నిర్ణయాలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోబోతోంది.
మారుతున్న పరిశీలన తీరు
ఇన్నాళ్లూ H-1B వీసా గురించి చర్చ వచ్చినప్పుడల్లా అంతా ఒక్క ఉద్యోగి చుట్టూనే తిరిగేది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా, ఇస్తున్న జీతం నిబంధనలకు తగినట్లు ఉందా, వీసా అర్హతలు ఉన్నాయా అనేది మాత్రమే చూసేవారు. కానీ, కొత్త ఆదేశాల ప్రకారం ప్రభుత్వం అసలు ప్రశ్నను కంపెనీ వైపు తిప్పింది. “మీరు ఇటీవల అమెరికన్ ఉద్యోగులను తీసేశారా?” అని నిలదీస్తోంది. ఒకవేళ తీసేసి ఉంటే, అదే తరహా పనుల కోసం విదేశీ ఉద్యోగిని ఎందుకు నియమించుకుంటున్నారో కంపెనీలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
భారతీయ ఉద్యోగులపై పడే ప్రభావం
ఈ కొత్త నిబంధనతో “అమెరికన్ అవుట్.. ఇండియన్ ఇన్” అనే పరిస్థితి ఉన్న చోట అసలు సమస్య మొదలవుతుంది. ఒక కంపెనీ నిర్దిష్ట టెక్ రోల్ నుండి అమెరికన్లను తీసేసి, కొంతకాలానికే అదే పనికి H-1B ద్వారా విదేశీ ఉద్యోగిని తెచ్చుకోవాలని చూస్తే ఆ అప్లికేషన్ తీవ్రమైన విచారణకు గురవుతుంది. దీనిర్థం అమెరికన్లను తీసేసి భారతీయులను తీసుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని కాదు, లేదా H-1B అప్లికేషన్లు వెంటనే రిజెక్ట్ అయిపోతాయని కూడా కాదు. కానీ, కంపెనీ లేఆఫ్ చరిత్ర అనేది వీసా ఆమోదంలో ఒక కీలకమైన అంశంగా మారిపోతుంది.
ఇవి కూడా చదవండి
వాషింగ్టన్ వర్గాల ప్రకారం, H-1B ప్రోగ్రామ్‌ను కొన్ని కంపెనీలు, స్టాఫింగ్ ఏజెన్సీలు తక్కువ జీతాలకే లభించే విదేశీ కార్మికులతో స్థానిక అమెరికన్లను భర్తీ చేయడానికి వాడుకుంటున్నాయనేది ప్రధాన ఆరోపణ. అందుకే ప్రభుత్వం ఇప్పుడు కంపెనీ జీతాలు, పరిశ్రమ తీరు, లేఆఫ్‌లు, H-1B నియామకాలు.. ఇలా అన్నింటినీ కలిపి ఒకే పెద్ద చిత్రంలో చూసేందుకు సిద్ధమైంది. మన భారతీయ ఐటీ నిపుణులకు H-1B ప్రధాన మార్గం కాబట్టి, ఇది కంపెనీల భవిష్యత్తు నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆర్థిక భారం, పెరిగే అనిశ్చితి
ఇది చాలదన్నట్లు ట్రంప్ ప్రభుత్వం కొన్ని H-1B దరఖాస్తులపై ఉండే $100,000 రుసుము నిబంధనను మరో 12 నెలల పాటు కొనసాగిస్తోంది. ఈ భారం సెప్టెంబర్ 2027 వరకు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు భారీ ఫీజులు, మరొకవైపు అమెరికన్లను తీసేసిన కంపెనీలపై కఠిన నిఘా.. ఈ రెండూ కలిసి H-1B నియామకాలను కంపెనీలకు ఒక పెద్ద సవాలుగా మార్చేస్తున్నాయి.
ఇప్పటికే H-1Bపై అమెరికాలో ఉన్నవారిని వెంటనే ఉద్యోగాల నుంచి తీసేయమని ఈ ఆదేశాలు చెప్పడం లేదు కానీ, ఉద్యోగం పోయినవారికి ఉండే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను కూడా తొలగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఒకవేళ లేఆఫ్స్ జరిగితే, H-1B హోల్డర్లకు వేరే కంపెనీ మారడం చాలా కష్టమవుతుంది.
ఇప్పటివరకు “విదేశీ ఉద్యోగిని అమెరికాలోకి రానివ్వచ్చా?” అనే ప్రశ్న మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు “అమెరికన్లను తీసేసి, విదేశీయులను ఎందుకు తీసుకుంటున్నారు?” అనే ప్రశ్నకు కంపెనీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో H-1B అప్లికేషన్లకు లభించే ఆమోదాలే ఈ కొత్త విధానం ఎంత కఠినంగా అమలు కాబోతోందో తేల్చనున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








