వివేకా కేసులో ఈడీ అరెస్టుల జాతర షురూ..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టిన ఈడీ అధికారులు, నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. తాజాగా గురువారం నాటి 9 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం, ఈరోజు రెండో రోజు కూడా ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ ఈడీ ఎదుట హాజరయ్యారు.
వివేకా హత్య వెనుక రూ. 40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగిందన్న గట్టి అనుమానాలతో ఈడీ మనీ లాండరింగ్ కోణంలో ఆరా తీస్తోంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన కీలక వాంగ్మూలమే ఇప్పుడు ఈడీకి ప్రధానాధారంగా మారింది. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన నగదు బదిలీలు, సునీల్ యాదవ్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చిన నిధులు, స్థిరాస్తుల కొనుగోళ్లపై ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను నిలదీస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఈ కేసులో ఈడీ దూకుడు చూస్తుంటే త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సునీల్ యాదవ్‌తో పాటు, ఈ కేసులో మిగిలిన నిందితులైన ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డిలకు కూడా ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వారిని సెప్టెంబర్ 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత నెలలోనే వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంతో పాటు పలువురు నిందితుల ఇళ్లపై దాడులు చేసిన ఈడీ, డిజిటల్ ఆధారాలను సేకరించింది. బ్యాంకు లావాదేవీలపై సరైన సమాధానాలు రాకపోతే, విచారణకు సహకరించడం లేదనే కారణంతో సునీల్ యాదవ్‌తో పాటు మరికొందరిని ఈడీ అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








