కృష్ణానదికి పోటెత్తిన ప్రవాహం.. ఈ ఏడాది మొదటిసారి..!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలతో పాటు మున్నేరు, బుడమేరు వాగుల నుంచి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో విజయవాడలోని(Vijayawada) ప్రకాశం బ్యారేజీకి ఈ ఏడాది మొదటిసారి ఈ స్థాయిలో భారీ వరద పొటెత్తింది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టానికి (FRL) చేరుకోవడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
బ్యారేజీకి ఎగువ నుంచి ప్రస్తుతం 40,521 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండటంతో, నీటి నిల్వను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి 36,250 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు, సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద నీటిని వదలడం ఇదే ప్రథమం కావడంతో నది పరివాహక ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది.
మరోవైపు డెల్టా పరిధిలోని కాలువలకు కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు 4,012 క్యూసెక్కుల నీరు, అలాగే గుంటూరు ఛానల్‌కు 239 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణానది ఎగువ, దిగువ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. మున్నేరు, బుడమేరు నదులకు కూడా వరద క్రమంగా పెరగడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.








