కోడింగ్ రాదా? నో ప్రాబ్లం! ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు.. మీరే సొంతంగా గేమ్ తయారు చేయొచ్చు!
ఇంతకాలం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ “అయ్యో, మళ్ళీ అరగంట టైమ్ వేస్ట్ అయిపోయిందే!” అని గిల్ట్తో బాధపడుతున్న రోజులకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతోంది. ఎందుకంటే, ఇకపై ఇతరులు చేసిన వీడియోలు చూస్తూ సమయం వృథా చేసుకోవడం కాకుండా, మీకు మీరే , మీ సొంత ఆలోచనలతో సొంతంగా గేమ్స్ తయారు చేసుకుని ఆడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ, సమయం వృధా చేసుకునే సరికొత్త ఆప్షన్‌ను మెటా మన ముందుకు తీసుకొస్తోంది.
“మీ టైమ్ పాడుచేసుకోవడానికి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడం దేనికి? మీరే ఒక గేమ్ డిజైన్ చేయండి, మీ ఫ్రెండ్స్‌ని పిలవండి, అంతా కలిసి ఆడుకోండి, అందరూ కలిసి టైమ్ ని సస్పెండ్ చేయండి” అని మెటా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో AI ఆధారిత గేమ్ క్రియేషన్ టూల్స్‌ను పరిచయం చేస్తోంది.
కోడింగ్ రాకపోయినా మీరు గేమ్ క్రియేటర్ అవ్వొచ్చు
ఇన్నాళ్ళూ ఒక గేమ్ తయారు చేయాలంటే కోడింగ్ నాలెడ్జ్, 3D డిజైనింగ్, గ్రాఫిక్స్, గేమ్ మెకానిక్స్ లాంటి ఎన్నో సాంకేతిక విషయాలపై పట్టు ఉండాలి. ఒక మంచి ఐడియా మన మనసులో ఉన్నా, దాన్ని గేమ్‌గా మార్చడానికి డెవలపర్ల సహాయం తప్పనిసరిగా ఉండేది.
కానీ మెటా ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ AIతో కూల్చేస్తోంది. మీకు ఎలాంటి కోడింగ్, డిజైనింగ్ అనుభవం లేకపోయినా ఒక మంచి ఐడియా ఉంటే చాలు. దాన్ని AIకి అర్థమయ్యేలా వివరిస్తే, మిగతా పనినంతా అదే పూర్తి చేస్తుంది.
మీ ఆలోచన చెప్తే చాలు.. AI గేమ్‌గా మార్చేస్తుంది
మెటా కనెక్ట్ 2026లో ప్రకటించిన ‘హోరైజన్ క్రియేట్’, ‘హోరైజన్ స్టూడియో’ అనే రెండు AI టూల్స్ ఈ మార్పుకు పునాదిగా నిలుస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో గేమ్స్ తయారు చేయడానికి హోరైజన్ క్రియేట్ ఉపయోగపడితే, బ్రౌజర్లో మరింత వివరంగా గేమ్‌ను మార్చుకునేందుకు హోరైజన్ స్టూడియో ఉపయోగపడుతుంది.
“ఒక ఫ్యూచరిస్టిక్ సిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకునే రేసింగ్ గేమ్ కావాలి” అని మన సాధారణ భాషలో చెప్తే చాలు, AI ఆ గేమ్‌కి సంబంధించిన వర్ల్డ్, డిఫికల్టీ లెవెల్స్, ఆర్ట్ స్టైల్‌ను సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా, మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒకేసారి గేమ్‌లోని వేర్వేరు భాగాలను డిజైన్ చేసే కొలాబరేషన్ ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయి.
యాప్ దాటి వెళ్లకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనే గేమింగ్
ఈ ప్లాన్‌లో అందరినీ ఆకట్టుకునే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గేమ్‌ను ఆడేందుకు ప్లే స్టోర్‌కి వెళ్లడం, డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేయడం వంటి తిప్పలేవీ ఉండవు. ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ఒక గేమ్ కనిపిస్తే, దానిపై క్లిక్ చేసి అక్కడికక్కడే ఆడుకోవచ్చు.
దీనివల్ల ఇన్స్టాగ్రామ్ కేవలం వీడియోలు చూసే వేదికగా మాత్రమే కాకుండా, గేమింగ్ ఈకోసిస్టమ్గా మారిపోతోంది. మనం సోషల్ మీడియాలో కేవలం ‘లైక్, షేర్’ కొట్టే సాధారణ ఆడియన్స్ గా ఉండకుండా, సొంతంగా కంటెంట్‌ను తయారుచేసి అందరితో కలిసి ఆడుకునే క్రియేటర్లుగా మారేలా ఈ మార్పు సాగుతోంది.
ఇవి కూడా చదవండి
రోబ్లాక్స్కు గట్టి పోటీ ఇవ్వనున్న మెటా
గేమింగ్ రంగంలో ఇప్పటికే పాపులర్ అయిన ‘రోబ్లాక్స్’ వంటి ప్లాట్‌ఫామ్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. రోబ్లాక్స్లో గేమ్స్ ఆడటానికి ప్రత్యేకంగా వెళ్లాల్సి వస్తే, ఇన్‌స్టాగ్రామ్‌లో మన ఫ్రెండ్స్ షేర్ చేసిన గేమ్ మన కంటిముందే కనిపిస్తుంది.
దానికి తోడు మెటా దగ్గర ఇప్పటికే కోట్లాది మంది ఆడియెన్స్ ఉన్నారు కాబట్టి, మనం తయారు చేసిన గేమ్‌ను ఆడేందుకు ప్లేయర్లు దొరకడం చాలా సులభం. గతంలో విఆర్ హెడ్సెట్లు పెట్టుకుని ‘హోరైజన్ వరల్డ్స్’లోకి రావాలని కోరిన మెటా, ఇప్పుడు ఏకంగా మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లకే ఆ గేమింగ్ ప్రపంచాన్ని తీసుకెళ్తోంది.
లక్షల గేమ్స్ మధ్య అసలైన సవాలు అదే!
AI సహాయంతో గేమ్‌ను తయారు చేయడం తేలికవుతుంది కానీ, దాన్ని ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆడేలా ఆసక్తికరంగా మలచడం మాత్రం ఇప్పటికీ మనుషుల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో కంటెంట్ కొరత లేదు, కానీ ‘మంచి కంటెంట్’ కొరత మాత్రమే ఉంది.
రేపు AI వల్ల వేలాది గేమ్స్ అందుబాటులోకి వస్తే, “ఎవరు గేమ్ తయారు చేయగలరు?” అనే దానికంటే “ఎవరి గేమ్ నిజంగా ఆడేలా ఇంట్రస్టింగ్ గా ఉంది?” అనేదే అసలైన ప్రశ్నగా మారుతుంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో రాబోతున్న ఈ టూల్స్‌తో క్రియేటర్ కావడానికి కెమెరా, స్మార్ట్‌ఫోన్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల తర్వాత ఇప్పుడు కేవలం ఒక ఐడియా ఉంటే చాలు అనే రోజులు వస్తున్నాయి.
ఇన్నాళ్లూ ఇతరుల కంటెంట్ చూస్తూ టైమ్ వేస్ట్ చేసుకున్న మనం, ఇకపై మనమే గేమ్స్ తయారు చేసుకుంటూ మరింత సృజనాత్మకంగా టైమ్ స్పెండ్ చేయవచ్చు. ఇది టైమ్ వేస్ట్ కానే కాదు, పూర్తిగా క్రియేటివ్ టైమ్ అని మెటా చెప్తోంది..మీరు నమ్మాలి మరి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








