కాకినాడలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
వెల్స్పన్ గ్రూప్ సిఇఓ నితిన్ జైన్ తో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): పైప్స్ & స్టీల్, హోమ్ టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ & లాజిస్టిక్స్ రంగాల్లో పేరెన్నికగన్న వెల్స్పన్ వరల్డ్ (ఇండియా) గ్రూప్ సిఇఓ నితిన్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో వెల్స్పన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డీఐ పైపుల తయారీ, పైపు కోటింగ్ యూనిట్, గ్రీన్ అమోనియా తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. గత ఏడాది దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల్లో చేసిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. వెల్స్పన్ సిఇఓ నితిన్ జైన్ మాట్లాడుతూ… ప్రస్తుతం తమ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తోంది. కాకినాడ–శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్ (APGDC), రిలయన్స్ KG-D6 కోసం పైపుల సరఫరా చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.








