‘ది ప్యారడైజ్’లో కేసీఆర్, ఎన్టీఆర్.. మాజీ సీఎంలు , ఆ పాత్రలు ఎవరు చేశారంటే?
నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ మాస్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రమోషన్ల హడావుడి లేకుండా, కేవలం కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నాని ‘జడల్’ పాత్రలో ఊరమాస్ అవతార్‌తో అదరగొట్టేశారు. అయితే, నాని పెర్ఫార్మెన్స్ ఎంత చర్చనీయాంశమైందో, ఈ సినిమాలో కనిపించిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులని పోలిన పాత్రలు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారాయి.
కేసీఆర్‌ను గుర్తుచేసే ‘శంకరన్న’ పాత్ర వెనుక కథ
ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ‘శంకరన్న’ అనే ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తారు. స్క్రీన్ మీద ఆయన పేరును కేసీఆర్ అని ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఆయన వేసిన గెటప్, ప్రత్యేకంగా ముక్కు భాగంలో చేసిన ప్రోస్థటిక్ మేకప్ చూడగానే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారే గుర్తుకొస్తారు.
కథ రీత్యా ‘సవారీలు’ అనే ఒక వర్గానికి పౌరసత్వం, ప్రభుత్వ గుర్తింపు ఉండవు. తమ అస్తిత్వం కోసం పోరాడే ఆ ప్రజలకు అండగా నిలిచే నాని కేసీఆర్ ని వెళ్లి కలుస్తాడు. కేసీఆర్ లా ముక్కు అదీ మేకప్ లో సెట్ చేసారు ప్రియదర్శికు, అలాగే కేసీఆర్ మాట్లాడే ఆ స్లాంగ్ కూడా ట్రై చేసారు. నానీకి, కేసీఆర్ కు మధ్య డిస్కషన్ జరుగుతుంది. నానిని కేసీఆర్..ఈ సాయుధపోరాటం వద్దని , అందరూ తుపాకులే పట్టుకుంటే మొత్తం సమాజంలో అవే మిగులుతాయని హెచ్చరిస్తాడు. మీరు పరిస్దితిలను సరిచేస్తే నేను తుపాకి వదిలేస్తానని నాని అంటారు. ఇలాంటి డైలాగులుతో ఈ ఎపిసోడ్ సాగుతుంది. కేసీఆర్ పాత్ర తెరపై కనపడగానే విజిల్స్ పడ్డాయి. జనం ఉత్సాహంగా అరిచారు.
కేసీఆర్ ని పోలిన పాత్రలో ప్రియదర్శి కనిపిస్తారు. రూపం కేసీఆర్‌ను పోలి ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా ఒక కల్పిత ఎమ్మెల్యే పాత్రగానే దర్శకుడు తీర్చిదిద్దారు.
సీఎం సీన్లో మెరిసిన ఎన్టీఆర్ లుక్
ఇక మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. దివంగత నందమూరి తారక రామారావు గారిని పోలిన ముఖ్యమంత్రి పాత్ర. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్‌గా నటించి మెప్పించిన పి. విజయ్ కుమార్ గారే ఈ సినిమాలోనూ ఆ పాత్రను పోషించారు.
కథ చివరి సన్నివేశాల్లో ప్యారడైజ్ ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నారని శంకరన్న చెప్పడం, ఆ తర్వాత కారు దిగే సీఎం పాత్రలో ఎన్టీఆర్ లుక్‌లో విజయ్ కుమార్ కనిపిస్తారు. ఇక్కడ కూడా నేరుగా ఎన్టీఆర్ అని చెప్పకపోయినా, ఆయన రూపం, ఆ గంభీరత చూడగానే ప్రేక్షకులకు అది ఎవరి పాత్రో వెంటనే అర్థమైపోతుంది.
ఇద్దరు దిగ్గజాల పాత్రలు ఒకే కథలో ఎందుకు?
తెలుగు రాజకీయాల్లో వేర్వేరు కాలాల్లో శకం సృష్టించిన కేసీఆర్, ఎన్టీఆర్ పోలికలు ఉన్న పాత్రలను ఒకే సినిమాలో చూపించడం నిజంగానే పెద్ద ప్రయోగం. సవారీల జీవితాలను మార్చడానికి శంకరన్న ఆ ముఖ్యమంత్రిని తమ ప్రాంతానికి ఎందుకు తీసుకొస్తారు? ఆ ఒక్క సన్నివేశం సినిమా కథను ఏ మలుపు తిప్పుతుంది? అనేది వెండితెరపై చూస్తేనే అసలైన కిక్ వస్తుంది. పేర్లు బయటకు చెప్పకుండా, వారి రాజకీయ ఇమేజ్ను మాత్రం కథకు అనుగుణంగా వాడుకోవడం ఈ సినిమాని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








