మీ మీద పడే సూర్యకిరణం.. మీకంటే లక్ష సంవత్సరాలు సీనియర్!
—శివ దువ్వూరు
ఉదయం పూట సూర్యకాంతి ఇంట్లోకి వచ్చినప్పుడు మనం సాధారణంగా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం. కిటికీ తెరను కొంచెం పక్కకు జరిపితే అది లోపలికి వస్తుంది. తెరను పూర్తిగా మూసేస్తే బయటే ఉంటుంది. కొన్నిసార్లు అది అంత అవసరమైన విషయంగా కూడా అనిపించదు. సూర్యుడు ఉదయించాడు, వెలుగు వచ్చింది, ఓ కొత్త రోజు మొదలైంది. అంతే..
అయితే మన ముఖాన్ని తాకుతున్న ఆ సూర్యకిరణం గురించి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుసుకుంటే, దాన్ని మళ్లీ అంత సాధారణంగా చూడటం కష్టం. అదేమిటంటే…ఆ సూర్య కిరణం మీ కంటే లక్ష సంవత్సరాలు సీనియర్. అంటే మీ కన్నా వయస్సులో లక్ష ఏళ్లుకు పైగా పెద్దది. ఎప్పుడో ఐస్ ఏజ్ నాడు పుట్టింది. ఇప్పుడు మనని, మన ఇంటికి వచ్చి పలకరిస్తోంది.
ఇది వయసు గురించి చెప్పిన ఒక చమత్కారం కాదు. సూర్యుడి లోపల పుట్టిన కాంతి, అక్కడి నుంచి బయటకు రావడానికి లక్ష సంవత్సరాలకు పైగా సమయం పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అంటే మీరు ఉదయం చూసిన సూర్యకాంతి.. సూర్యుడి నుంచి ఇప్పుడే పుట్టింది కాదు. అది చాలా కాలంగా తన ప్రయాణంలో ఉంది. మన దగ్గరకు చేరింది మాత్రం ఇప్పుడే.
ఒక కాంతి కణం ఇంతకాలం ఏం చేస్తుంది?
సూర్యుడి అనగానే మన మనస్సులో ఓ విజువల్ వచ్చేస్తుంది. మధ్యలో ఒక పెద్ద అగ్నిగోళం. దాని నుంచి కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి అంతరిక్షంలోకి దూసుకెళ్లి భూమిని చేరుతుంది. ఆ విజువల్ తప్పు కాదు. కానీ అది చాలా అసంపూర్ణమైనది.
వాస్తవానికి సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత దాదాపు 27 మిలియన్°F. అక్కడ హైడ్రోజన్ అణువులు అణు సంయోగ చర్యల ద్వారా హీలియంగా మారుతూ శక్తిని విడుదల చేస్తుంటాయి. ఆ ప్రక్రియలో పుట్టిన కాంతి బయటకు రావాలి.
కానీ “బయటకు రావాలి” అనేది ఒక కోరిక మాత్రమే. దానికి మార్గం మాత్రం అంత సులభం కాదు. సూర్యుడి లోపల పదార్థం అత్యంత దట్టంగా ఉంటుంది. కాంతి కణాలు పదేపదే ఇతర కణాలను ఢీకొంటాయి. ప్రతి ఢీకొన్న తర్వాత దిశ మారుతుంది. ముందుకు వెళ్లినట్లు అనిపించిన కాంతి మళ్లీ మరో దిశలోకి తిరుగుతుంది. అలా ఒక చిన్న కాంతి కణం సూర్యుడి లోపల లక్ష సంవత్సరాలకు పైగా గడపవచ్చు.
మన మనుషులకు ఇది కొంచెం విచిత్రమైన విషయం. మనకు కాంతి అంటే వేగం. సూర్యుడి లోపల మాత్రం అదే కాంతి ఒక రకంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వేగవంతమైన కారు లాంటిది. ఒక ఫోటాన్ కొంత దూరం వెళ్లగానే మరో కణాన్ని ఢీకొంటుంది. దాని దిశ మారుతుంది. మళ్లీ ప్రయాణిస్తుంది. మళ్లీ ఢీకొంటుంది. అది ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రతి కొన్ని అడుగులకు దారి తప్పుతున్న ఒక ప్రయాణికుడిలా ఉంటుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు random walkగా వివరిస్తారు.
అందుకే కాంతి సూర్యుడి లోపలి భాగం నుంచి బయటకు రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా చెప్పుకునే అంచనా లక్ష సంవత్సరాల స్థాయిలో ఉంటుంది; ఖచ్చితమైన సమయం సూర్యుడి లోపల ఏ ప్రాంతం నుంచి ప్రయాణం మొదలైందన్నదానిపై మారుతుంది. అంటే.. కాంతికి వేగం తక్కువ కాదు. దాని దారి చాలా కష్టమైనది.
కానీ సూర్యుడి బయటకు వచ్చిన తర్వాత కథ మారిపోతుంది
ఒకసారి కాంతి సూర్యుడి ఉపరితలాన్ని దాటితే, దానికి ఎదురయ్యే అడ్డంకులు ఒక్కసారిగా తగ్గిపోతాయి. అక్కడి నుంచి భూమి వరకు దూరం దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. మనిషి నిర్మించిన ఏ వాహనంతో పోల్చినా అది ఊహించలేనంత దూరం. కాంతికి మాత్రం అది పెద్ద సమస్య కాదు.
సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి సూర్యుడి నుంచి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకన్లు తీసుకుంటుంది.
ఆశ్చర్యంగా ఉందా… సూర్యుడి లోపల నుంచి బయటకు రావడానికి లక్ష సంవత్సరాలు. సూర్యుడి నుంచి భూమికి రావడానికి ఎనిమిది నిమిషాలు. ఒక కాంతి కణం తన ప్రయాణంలో ఎక్కువ సమయం సూర్యుడి లోపలే గడుపుతుంది. అంతరిక్షంలో మాత్రం దాదాపు పరుగెత్తుతుంది.
అంటే మనం సూర్యుడిని “ఇప్పుడు” చూడటం లేదా?
లేదు.. మనం ఆకాశంలో సూర్యుడిని చూస్తున్నప్పుడు, నిజానికి సుమారు 8 నిమిషాల క్రితం సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతిని చూస్తున్నాం.
ఆకాశాన్ని చూడటం అంటే గతాన్ని చూడటం.
చంద్రుడిని చూసినా, సూర్యుడిని చూసినా, నక్షత్రాలను చూసినా.. మన కళ్లకు చేరేది అక్కడి నుంచి బయలుదేరిన కాంతి. దూరంగా ఉన్న నక్షత్రాల విషయంలో ఈ “గతం” మరింత లోతుగా ఉంటుంది. కొన్ని నక్షత్రాల కాంతి మన దగ్గరకు చేరడానికి సంవత్సరాలు పడుతుంది. మరికొన్ని ఖగోళ వస్తువుల కాంతి మనకు చేరే సమయానికి వాటి అసలు పరిస్థితి చాలా కాలం క్రితమే మారిపోయి ఉండవచ్చు.
ఆకాశం ఒక విధంగా చూస్తే, కాంతితో రాసిన పాత జ్ఞాపకాల పుస్తకం.
సూర్యుడు కేవలం వెలుతురు పంపడు. మన ఉదయాలకు కారణమైన అదే సూర్యుడు అంతరిక్షంలో మరో పని కూడా చేస్తూనే ఉంటాడు. ఆయన నుంచి విద్యుదావేశం కలిగిన కణాలు నిరంతరం బయటకు వస్తుంటాయి. వీటినే సౌర గాలి (Solar Wind) అంటారు.
పేరు వినగానే మనకు సముద్రతీరంలో వీచే గాలి లేదా వేసవి మధ్యాహ్నం వచ్చే వేడి గాలి గుర్తొచ్చే అవకాశం ఉంది. కానీ ఇది గాలి కాదు. ఇది విద్యుదావేశిత కణాల ప్రవాహం. ఇవి గంటకు దాదాపు 10 లక్షల మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్లగలవు.
అంటే సూర్యుడు కేవలం వెలుగు ఇచ్చే ఒక దీపం కాదు. అది నిరంతరం శక్తిని బయటకు పంపుతున్న ఒక మహా నక్షత్రం.
ఆ కణాలు భూమిని తాకకుండా ఎవరు అడ్డుకుంటారు?
ఇక్కడ భూమి తన గురించి మనకు కనిపించని ఒక విషయం చెబుతుంది. మన గ్రహం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంది. దాన్ని మనం చూడలేం. తాకలేం. దాని సరిహద్దులు కూడా మన కళ్లకు కనిపించవు. అయినా అది సూర్యుడి నుంచి వచ్చే అనేక శక్తివంతమైన కణాలను దారి మళ్లిస్తుంది. ఒక అదృశ్య కవచంలా భూమిని చుట్టుముడుతుంది.
మన దైనందిన జీవితంలో మనం దాని గురించి దాదాపు ఎప్పుడూ ఆలోచించం. మనం వాతావరణాన్ని చూస్తాం. వర్షాన్ని చూస్తాం. మేఘాలను చూస్తాం. కానీ భూమి చుట్టూ అంతరిక్షంలో కూడా ఒక “వాతావరణం”లాంటి రక్షణ వ్యవస్థ ఉందన్న విషయం మర్చిపోతాం. కొన్నిసార్లు ఆ రక్షణే ఆకాశాన్ని రంగులతో నింపుతుంది
సౌర గాలిలోని కొన్ని కణాలు భూమి అయస్కాంత క్షేత్రం వెంట ధ్రువాల వైపు చేరుతాయి. అక్కడ అవి పై వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయు కణాలతో ఢీకొంటాయి. ఆ ఢీకొనడాల ఫలితంగా రాత్రి ఆకాశంలో ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగుల్లో మెరుస్తూ కదిలే వెలుగులు కనిపిస్తాయి.
కాబట్టి…
రేపు ఉదయం కిటికీ గుండా ఒక సూర్యకిరణం లోపలికి వచ్చినప్పుడు, దాన్ని కేవలం వెలుతురుగా చూడాల్సిన అవసరం లేదు. అది ఒక నక్షత్రం నుంచి వచ్చిన సందేశం. ఆ సందేశం మన దగ్గరకు చేరేలోపు చాలా కాలం గడిచిపోయింది. మన మీద పడే సూర్యకిరణం.. నిజంగానే మన కంటే లక్ష సంవత్సరాలు సీనియర్. మన కంటే ముందే ఈ ఉదయాన్ని చూసి ఉండొచ్చు.








