డిసెంబర్ లో అమెరికాకు మోడీ.. జి 20 శిఖరాగ్ర సదస్సుకుహాజరు..?
భారత ప్రధానమంత్రి మోడీ.. డిసెంబర్ లో అమెరికాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 14,15 తేదీల్లో ఫ్లోరిడాలో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సును 2009 తర్వాత అమెరికా నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు, ఇదే సదస్సు వేదికగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ నేతల సమావేశం నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
జీ20 సదస్సు కోసం ప్రధాని డిసెంబర్లో అమెరికా వస్తారని యూఎస్ రాయబారి జూన్‌లోనే సంకేతాలు ఇచ్చారు. అయితే, భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాధారణంగా పర్యటన తేదీలకు సమీపంలోనే విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేస్తుంది. ఈ పర్యటన ఖరారైతే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక అంశాల్లో పురోగతికి దోహదపడనుంది.
ఇవి కూడా చదవండి
అమెరికా పర్యటన ముగిసిన అనంతరం మోడీ.. కెనడాలో కూడా పర్యటించే అవకాశం ఉందని సమాచారం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్-కెనడా మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి.








