ఐమెక్ కు ట్రంప్ మద్దతు…!
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐమెక్ కారిడార్ కు మద్దతు పలికారు. భారత్ నుంచి మొదలై.. పశ్చిమాసియా మీదుగా యూరప్ కు వెళ్లే ‘ఐమెక్ కారిడర్’ (the India-Middle East-Europe Economic Corridor)కు మద్దతిస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్‌కు పట్టున్న ప్రాంతం నుంచి ఇంధన మౌలిక వసతుల తరలింపునకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. జనరల్ అసెంబ్లీకి అనుబంధంగా జరిగిన బహుళపక్ష సమావేశంలో భాగంగా ట్రంప్-గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యులతో భేటీ అయ్యారు.
‘‘పొరుగు దేశాల్లోని నౌకలపై ఇరాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఈ విషయం పశ్చిమాసియాలో ఇంధన సదుపాయాల్లో మార్పులు రావాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇరాన్‌కు పట్టున్న జలసంధికి దూరంగా ఇవి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మా కార్యవర్గం ‘ఐమెక్’, ఇతర ప్రదేశాలకు పూర్తి మద్దతు పలుకుతోంది. చమురును పైపులైన్ లేదా మరే విధంగానైనా ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించాలి. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పీడిస్తోన్న సమస్యల నుంచి మనం బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ట్రంప్ జీసీసీ సభ్యులకు వెల్లడించారు.
ఐమెక్గా పిలిచే ది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇది భారత్‌లో మొదలై యూరప్ లో ముగుస్తుంది. దీనిని 2023 సెప్టెంబర్ 9న తొలి సారి ఆవిష్కరించారు. ఢిల్లీ జీ20 సదస్సు దీనికి వేదికైంది. దక్షిణాసియా-పశ్చిమాసియా-యూరోపియన్ దేశాలను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.








