తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కర్నాటక!
ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు కర్ణాటక ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. అంతర్రాష్ట్ర జల వివాదాలను పక్కన పెట్టి.. రాజకీయాలకు అతీతంగా మానవత్వం ప్రదర్శించింది. ఎల్‌నినో వల్ల వర్షాలు పడక అల్లాడిపోతున్న పాలమూరు నేలలకు సాగు, తాగునీరు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆల్మట్టి రిజర్వాయర్ నుండి జూరాలకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంగీకరించారు. దీంతో తెలంగాణ మంత్రుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
తెలంగాణలో ఏర్పడిన తీవ్ర నీటి ఎద్దడి, ఎండిపోతున్న పంటల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం కర్ణాటకలో పర్యటించింది. కర్ణాటక సీఎం, జలవనరుల శాఖ మంత్రి అయిన డీకే శివకుమార్‌ను మరోసారి కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్న దయనీయ పరిస్థితులను, తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందిని గణాంకాలతో వివరించారు. కేవలం రాజకీయ వివాదాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని కోరిన మంత్రుల విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
నీటిని విడుదల చేయాలన్న కర్నాటక నిర్ణయం.. కేవలం జల వివాదాల సమస్య మాత్రమే కాదు.. దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త ఒరవడికి ప్రతీకగా నిలిచింది. ఒకే పార్టీ అధికారంలో ఉన్న రెండు పొరుగు రాష్ట్రాలు పరస్పర సహకారం, సంప్రదింపులతో ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది. గతంలో తరచూ ఉత్పన్నమయ్యే జల వివాదాలకు భిన్నంగా, ఫెడరల్ స్ఫూర్తిని చాటుతూ పరస్పర అవగాహనతో రెండు రాష్ట్రాలూ ముందుకెళ్లడం విశేషం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సమన్వయం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనే చర్చకు తెరలేపింది.
మంత్రుల విజ్ఞప్తిని పరిశీలించిన వెంటనే డీకే శివకుమార్ అత్యంత సానుకూలంగా స్పందించారు. మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు తక్షణమే ఆదుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అంశంపై ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు, తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది.








