ట్రంప్ ‘TV’లో ఏం చూపిస్తున్నారు? 24/7 ఛానల్ ప్రారంభం వెనక అసలు కథేంటి?
ఒక దేశ అధ్యక్షుడి మాటలు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే మధ్యలో ఒకప్పుడు కెమెరా అవసరం. ఆ కెమెరా వెనుక ఒక టీవీ నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్ వెనుక ఎడిటర్లు, రిపోర్టర్లు, ప్రసార నియమాలు ఉండేవి. ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వంలో ఒక భాగాన్ని వైట్‌హౌస్ తానే తొలగించుకోవాలని చూస్తోంది.
సెప్టెంబర్ 21న వైట్‌హౌస్ “TRUMP TV: The Essentials Station” పేరుతో 24 గంటల డిజిటల్ వీడియో స్ట్రీమ్‌ను ప్రారంభించింది. ఇది కేబుల్ ఛానల్ కాదు; YouTubeతో పాటు వైట్‌హౌస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో నడిచే అధికారిక ఫీడ్. వైట్‌హౌస్ ప్రకారం ఇందులో ట్రంప్ గత ప్రసంగాలు, ముఖ్యమైన ప్రకటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, తాజా వీడియోలు నిరంతరం ప్రసారం అవుతాయి.నిజానికి ప్రభుత్వ యూట్యూబ్ ఛానెల్ అంటే పెద్దగా పట్టింపు ఉండదు. అయితే ఈ ఛానెల్ వచ్చిన టైమింగ్ మాత్రం ఈ విషయం డిస్కషన్ గా మార్చేసింది.
Trump TV వచ్చిన రోజుకు ముందు, అమెరికా అధ్యక్షుడి టెలివిజన్ కవరేజీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒక వ్యవస్థ ఆగిపోయింది.
మీడియా తలుపు మూసుకుంది
Trump TV ప్రారంభానికి కొద్దిరోజుల ముందు CNN, MS NOW, Politicoలకు వైట్‌హౌస్ యాక్సెస్ నిరాకరించబడింది. ట్రంప్ ఈ సంస్థలు తన ప్రభుత్వాన్ని న్యాయంగా కవర్ చేయడం లేదని ఆరోపించారు. మీడియా సంస్థలు మాత్రం ఈ చర్యను పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నగా కోర్టులో సవాలు చేశాయి.
ఇది అమెరికా రాజకీయాల్లో కొత్తగా కనిపించే వివాదం కాదు. అధ్యక్షులు, మీడియా మధ్య సంబంధం ఎప్పుడూ సంభందాలు సరిగ్లా లేవు. ఎన్ని అనుకున్నా..చివరకు వైట్‌హౌస్‌కు మీడియా అవసరం ఉంటుంది.మీడియాకు వైట్‌హౌస్ అవసరం ఉంటుంది. ఒకరు సమాచారాన్ని ఇస్తారు. మరొకరు దాన్ని పరిశీలిస్తారు.
కానీ ఇప్పుడు ట్రంప్ టీవీ రాకతో ఆ సంబంధంలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. “మీరు మా కథను సరిగ్గా చెప్పడం లేదనుకుంటే, మేమే మా కథ చెబుతాం.” అనే పాలసీ అన్నమాట. Trump TVని అక్షరాలా ఈ వాక్యానికి అనువాదంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ దాని ప్రసారాలు, నిర్మాణం మాత్రం అలాంటి ప్రశ్నను తప్పించుకోనివ్వదు.
కెమెరాలు వెళ్లిపోయిన రోజు
ఇలాంటి సొంత ఛానెల్ పెట్టుకోవాల్సిన పరిస్దితి ఎప్పుడు వచ్చింది అంటే…ట్రంప్ కొత్త వైట్‌హౌస్ హెలిప్యాడ్‌ను ప్రారంభిస్తున్న సమయంలో వచ్చింది. సాధారణంగా అధ్యక్షుడి కార్యక్రమాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, ప్రసార సిబ్బంది ఉంటారు. ఒక నెట్వర్క్ కెమెరా తీసిన ఫీడ్‌ను ఇతర టీవీ నెట్‌వర్క్‌లు కూడా ఉపయోగించుకుంటాయి. దాన్ని White House pool అంటారు.
కానీ ట్రంప్‌పై మీడియా వివాదం తీవ్రమవడంతో ప్రధాన నెట్‌వర్క్‌లు ఆ పూల్ కవరేజీ నుంచి తప్పుకున్నాయి. ఫలితం వెంటనే కనిపించింది. ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ వైట్‌హౌస్ లైవ్‌స్ట్రీమ్‌లో ఆయన మాటలు సరిగ్గా వినిపించలేదు. సాధారణంగా అక్కడ ఉండే బూమ్ మైక్రోఫోన్లు లేవు. ఒక అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కెమెరా ఉంది. లైవ్‌స్ట్రీమ్ ఉంది.కానీ శబ్దం లేదు. దీన్నే వైట్‌హౌస్ ప్రతినిధి కేలన్ డోర్ Trump TVని పరిపాలన యొక్క “greatest hits, unfiltered” గా అభివర్ణించారు.
“Unfiltered” అనే పదం ఇక్కడ ప్రత్యేకంగా ఇంట్రస్టింగ్ గా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే వార్తా సంస్థ చేసే పని కేవలం కెమెరా ఆన్ చేయడం కాదు. అది ఎంచుకుంటుంది. క్రమబద్ధీకరిస్తుంది. ప్రశ్నిస్తుంది. ఒక ప్రకటనను మరో వాస్తవంతో పోలుస్తుంది. కొన్నిసార్లు తప్పులను గుర్తిస్తుంది. ప్రభుత్వం తన సొంత ఛానల్ నడిపినప్పుడు ఈ మధ్యవర్తిత్వం ఉండదు. అది చెడు అని చెప్పడం కాదు. కానీ అది వేరే రకం సమాచార వ్యవస్థ. అక్కడ ప్రభుత్వం కేవలం వార్తకు మూలం మాత్రేమే కాదు. అదే సమయంలో ప్రసారకర్త కూడా.
ఇది టీవీ కంటే పెద్ద ప్రయోగమా?
Trump TV యొక్క ప్రాముఖ్యత దాని ప్రేక్షకుల సంఖ్యలో ఉండకపోవచ్చు. అది YouTubeలో ఎంతమంది చూస్తారు? ఎంతసేపు చూస్తారు? ప్రజలు దాన్ని నిజంగా వార్తా వనరుగా ఉపయోగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా లేదు.అలాగే Trump TV భవిష్యత్తులో కేవలం ఆర్కైవ్ ప్రసంగాల స్ట్రీమ్‌గా ఉంటుందా, లేక మరింత విస్తరించిన ప్రభుత్వ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మారుతుందా అన్నది కూడా తెలియలేదు.
కానీ Trump TV ప్రారంభం ఒక మారుతున్న మీడియా ప్రపంచానికి చిన్న సంకేతంలా కనిపిస్తుంది. ఒకప్పుడు అధ్యక్షుడు ప్రజలను చేరుకోవడానికి టెలివిజన్ నెట్‌వర్క్‌లను ఆశ్రయించేవాడు. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తన సొంత డిజిటల్ ప్రసార మార్గంలో ముందుకు వెళ్తోంది.
ఫైనల్ గా…
ఏదైమైనా Trump TV అనేది వార్తల కోసం ప్రభుత్వం నిర్మించిన స్టేషనా, లేక ప్రభుత్వ కథనాల కోసం నిర్మించిన వార్తా మాధ్యమమా? ఆ తేడా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో, కెమెరా ఎవరిది అన్న ప్రశ్న కంటే.. కెమెరా చూపించని దాన్ని ఎవరు చూపిస్తారు అన్న ప్రశ్నకు సమాధానమే విసృతమైనది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








