నాపై కోపం ఉంటే తేల్చుకుందాం…రా… టీచర్ల జోలికొస్తే సహించేది లేదు : మంత్రి లోకేష్
గురువులపై దాడిచేసిన గొడ్డలిపార్టీ రౌడీ బ్యాచ్ ఎక్కడున్నా వదలం!
డేట్, టైమ్ ఫిక్స్ చేయి…డిఎస్సీతోపాటు ఎపిపిఎస్సీ, కల్తీ మద్యంపై కూడా చర్చిద్దాం
నీతి,నిజాయితీలతో బతికిన కుటుంబం మాది… చంద్రబాబుపై ఒక్కటైనా నిరూపించగలిగారా?
ప్రతిపక్షంలో ఉన్నపుడే భయపడలేదు… ఇప్పుడు భయపడతామా జగన్?!
రాప్తాడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్
రాప్తాడు: నిన్న శాప్ కార్యాలయం వద్ద విద్యనేర్పే గురువులపై గొడ్డలిపార్టీ రౌడీమూకలు విచక్షణారహితంగా గుడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్ లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. ఎపిలోనే కాదు, అండమాన్ లో ఉన్నా, ఆస్ట్రేలియా వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తామని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ టెన్త్ క్లాస్ తప్పాడు. అందువల్లే టీచర్లపై కక్ష పెంచుకున్నాడు. నిన్న ఉపాధ్యాయులపై రౌడీమూకలను ఉసిగొల్పాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మేం భయపడలేదు, ఇప్పుడు భయపడతామా? నీతి, నిజాయితీగా బతికిన కుటుంబం మాది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో పెట్టారు, ఒక్కటైనా నిరూపించ గలిగారా? ఆయనపై పెట్టిన ఒక్క కేసుకూడా నిలబడలేదు. నాపై కోపం ఉంటే నేరుగా రా… టైమ్, డేట్ ఫిక్స్ చెయ్యి, తేల్చుకుందాం. కల్తీ మద్యం, ఎపిపిఎస్సీపై కూడా చర్చిద్దాం. నాపై కోపం ఉంటే నాతో తేల్చుకో. అంతేగానీ ఉపాధ్యాయుల జోలికొస్తే సహించేది లేదని లోకేష్ హెచ్చరించారు.
అబద్దానికి ప్యాంటు,షర్టు వేస్తే జగన్!
అబద్దానికి ప్యాంటు, షర్టు వేస్తే వచ్చే రూపమే జగన్. నిజం చెబితే తల వెయ్యి ఒక్కలు అవుతుందని ఆయనకు శాపం ఉంది. అందుకే ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. అయిదేళ్లు ఒక్క డిఎస్సీ ప్రకటించలేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చి ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు. బాబు గారు తొలి సంతకం డిఎస్సీ పైనే చేశారు. దానిని ముందుకు సాగనీయకుండా చేసేందుకు వైసిపి నాయకులు 300 కేసులు వేశారు. ఎక్కడా కోర్టు తప్పుపట్టలేదు. 150రోజుల్లో 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. వారందరికీ అమరావతిలో అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చాం. ఏడాది తర్వాత ఇప్పుడు వచ్చి అవినీతి జరిగింది అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం గెలవాలి
గత సార్వత్రిక ఎన్నికల్లో 94శాతం సీట్లతో ఘనవిజయం సాధించాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే. వచ్చేనెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్ధంకావాలి. రెండున్నరేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాలపై ప్రజల్లో చైతన్యం తేవాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. చిన్నచిన్న విభేదాలను పక్కనపట్టి ముందుకెళదాం. విజయం కోసం కలసికట్టుగా ముందుకు సాగుదాం. అన్నిస్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిపించేందుకు కార్యకర్తలంతా కార్యోన్ముఖులు కావాలి. డిల్లీనుంచి గల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల మనం కోరిన అన్ని కోర్కెలు ప్రధాని తీరుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలసికట్టుగా ముందుకెళ్లాలి. నోక్రాస్ ఫైర్, నో మిస్ ఫైర్, నో విడాకులు. మనది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం.
గొడ్డలి పార్టీ అనుబంధ విభాగాలు వేరు!
మనకు తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి వంటి అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైసిపి వాళ్లకు కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. అవి గొడ్డలి, గంజాయి, హిట్ అండ్ రన్, మహిళలను అవమానించడం, టీచర్లపై దాడిచేయడం వంటివి వారి విభాగాలు. మనపార్టీలో పరిటాల శ్రీరామ్ లాంటి అద్భుతమైన యువ నాయకత్వం ఉంది. ప్రజలకు సేవే చేసే నాయకత్వం మనది. వారి పార్టీలో హిట్ అండ్ రన్ లో జైలుకెళ్లిన వాడొకడు, భూకబ్జాలు, నకిలీ పత్రాలు సృష్టించిన వాడు మరొకడు, వరకట్నం కోసం భార్యను వేధించేవాడొకడు ఉన్నారు. గొడ్డలి పార్టీ నాయకత్వానికి, టిడిపి లీడర్ షిప్ కి తేడా ప్రజలు గమనించాలి. చంద్రబాబు మాకు ఓర్పు నేర్పడం వల్లే ఓపిగ్గా ఉన్నాం. లేకపోతే వైసిపి నాయకుల కథ మరోలా ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ వల్లే నాలుగున్నర దశాబ్ధాలుగా ప్రజాసేవలో ముందుకు సాగుతున్నాం. మరో వందేళ్లు ప్రజలకుసేవ చేసేలా పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం
రాష్ట్రం సర్వతో ముఖాభవృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. అహంకారం, ఇగొ వద్దు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో 2019లో తొలిసారి ఓడిపోయా. అయిదేళ్లు కష్టపడి ప్రజలతో మమేకమై, వారి మనసు గెలుచుకున్నా. రాష్ట్ర చరిత్రలో మూడవ అత్యధిక మెజారిటీతో గెలిచా. సంక్షేమం, అభివృద్ధితోపాటు ప్రజల మనసు గెలిస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలం. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. మీరిచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రజల్లో చైతన్యం తెస్తే మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తాం. వరుసగా ఒకే ప్రభుత్వం రావడం వల్లే ఒరిస్సా, గుజరాత్ లో అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో ఒకసారి మాత్రమే, అది కూడా చంద్రబాబు గారివల్లే వరుసగా టిడిపి గెలిచింది. ప్రతిరూపాయి ఆదాయంలో 94పైసలు జీతాలకే సరిపోతోంది. ఆదాయాన్ని పెంచడంతోపాటు పెద్దఎత్తున సంక్షేమాన్ని అందిస్తున్నాం. వృద్ధులకు 4వేల పెన్షన్, స్త్రీశక్తి, దీపం, నేతన్నల సేవలో, ఆటోవాల సేవలో తదితర పథకాలు అందిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
సేవాభావం అనంతపురం బ్లడ్ లోనే ఉంది
మెడపై కత్తిపెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు టిడిపికే సొంతం. రాప్తాడుకు వచ్చినపుడు నాకు ఘనస్వాగతం పలికిన టిడిపి కార్యకర్తలకు పేరుపేరునా నమస్కారాలు. కళల కాణాచి లేపాక్షి, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, ప్రశాంతి నిలయం కొలువై ఉన్న నేల ఉమ్మడి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న సత్యసాయి జన్మించిన నేల అనంతపురం. నేను ఒకేసారి ఆయనను కలిశాను. దశాబ్ధాల తర్వాత కూడా బాబా ఏ ఆలోచనతో సంస్థను స్థాపించారో ఇటీవల అక్కడ అదే క్రమశిక్షణ, పట్టుదల చూశా. ప్రజలకోసం దశాబ్ధాల క్రితం స్థాపితమైన ఆర్ డిటి అనంతపురానికి అద్భుతమైన సేవలందిస్తోంది. సేవ మన బ్లడ్ లోనే ఉంది. అందుకే అన్న ఎన్టీఆర్ అనంతపురం జిల్లాను సొంతం చేసుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. హరికృష్ణ, బాల మామయ్యలను శాసనసభకు పంపిన ఘనత అనంతపురం జిల్లాదే.
పరిటాల కుటుంబంతో దశాబ్ధాల అనుబంధం
పరిటాల కుటుంబంతో మా కుటుంబ అనుబంధం దశాబ్ధాల నాటిది. అన్యాయం జరిగిన చోట ఎదురొడ్డి నిలబడాలన్నది ఇరు కుటుంబాల ధ్యేయం. మహిళల జోలికొస్తే తోలు తీయాలన్న లక్ష్యంతో పనిచేశాం. భూస్వాములతో పోరాడి నిరుపేదలకు భూమి పంచారు పరిటాల శ్రీరాములయ్య. ఫ్యాక్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టారు పరిటాల రవీంద్ర. తనకు ప్రమాదం ఉందని తెలిసినా కార్యకర్తలను వెంటాడి చంపితే అండగా వెళ్లి, ప్రాణాలను కోల్పోయారు. కాంగ్రెస్, వైసిపిల హయాంలో ఉమ్మడి అనంతపురంలో 164మంది కార్యకర్తలను కోల్పోయాం. చంద్రబాబు గారు కార్యకర్తలు ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలు ఏర్పాటుచేశారు. ప్రతివారం ఎన్టీఆర్ మోడల్ స్కూలుకు వెళ్లి పిల్లల్లో ధైర్యం నింపారు. వారిని ప్రయోజకులను చేసిన ఘనత చంద్రబాబుది.
అవినీతిలో “తోపు” కేడర్ ను ఇబ్బందిపెట్టాడు!
2019 నుంచి 24వరకు రాప్తాడులో ఒక గొడ్డలిపార్టీ దొంగ… అవినీతిలో తోపు టిడిపి కేడర్ ను ఇబ్బంది పెట్టాడు. తప్పుడు కేసులు బనాయించాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తగ్గేది లేదు, కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. నాపై 23కేసులు పెట్టారు. పోరాటం మన బ్లడ్ లో ఉంది. రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం. వైసిపి హయాంలో ఒక్క అభివృద్ధి లేదు. ఒకవైపు దాడులు, మరో వైపు అవినీతి రాజ్యమేలాయి. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి సునీతమ్మను గెలిపించిన ఘనత రాప్తాడు ప్రజలది. మనమంతా ప్రజలకు అండగా నిలబడాలి. కలసికట్టుగా పోరాడాలి. జాకీ లాంటి సంస్థలను గత ప్రభుత్వంలో తరిమేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. పార్టీ కేడర్ పై పెట్టిన దొంగ కేసులు తొలగించే బాధ్యత నాది. ఇప్పటికే 80శాతం తప్పుడు కేసులు తొలగించాం. కొన్ని కోర్టువరకు వెళ్లాయి. న్యాయనిపుణుల సహకారంతో ఎన్నికల్లోపు ఆ కేసులు కూడా తీయించే బాధ్యత నాది.
కార్తకర్తే అధినేత నినాదం ఆచరణలో చూపుతున్నాం!
ఇటీవల కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ షిప్ కాంక్లేవ్ లో ప్రతి సమావేశంలో జై కార్యకర్త అనాలని పిలుపునిచ్చాం. 2025 కడప మహానాడులో కార్యకర్తే అధినేత నినాదాన్ని తీసుకోవడమేగాక, ఆచరణలో అమలుచేస్తున్నాం. నేను, బాబు గారు ఏ కార్యక్రమానికి వెళ్లినా కార్యకర్తను కలిశాకే వెళ్తున్నాం. తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాత, మంజుల, చెన్నుపాటి గాంధీ మనకు స్పూర్తి ప్రదాతలు. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడికి జై కొట్టమంటే చంద్రయ్య జై చంద్రబాబు అని ప్రాణాలొదిలారు. చట్టాన్ని సవరించి, చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కార్యకర్తల త్యాగాలను చంద్రబాబు మరువరు. కార్యకర్తల కోసం ప్రమాద బీమా తెచ్చాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.175 కోట్లు కార్యకర్తలకు అందించి ఆదుకున్నాం. కార్యకర్తల ఆరోగ్యం చూసుకునే బాధ్యత నాది. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలకు రక్తపరీక్షలు చేయిస్తే 75శాతం మందికి ఆరోగ్యం సరిగాలేదు. అందరూ పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యం బాగుంటే కుటుంబసభ్యులు బాగుంటారు, పార్టీ బాగుంటుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి మందులు కూడా ఉచితంగా అందిస్తాం.
కష్టపడి పనిచేస్తే పదవులు వెదుక్కుంటూ వస్తాయి
పార్టీలో సంస్కరణల కోసం నేను పార్టీలో అంతర్గతంగా పోరాటం చేశా. జిల్లా నుంచి పార్లమెంటు పార్టీ వ్యవస్థ కోసం మూడు పొలిట్ బ్యూరో సమావేశాల్లో నా వాదన విన్పించా. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం. పనిచేసే వారిని గుర్తిస్తాం. అందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం అప్ డేట్ చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 45రోజుల్లో డోర్ టు డోర్ చేసిన ఘనత మన పార్టీది. మీరు ప్రజల చుట్టూ తిరగండి, పదవులు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. పనిచేయకుండా పదవులు రావాలంటే కుదరదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. కార్యకర్తలంతా గుర్తు పెట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. 10వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఫైటర్ జెట్ నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ వరకు ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు తెచ్చాం. నిజం గడపదాటేసరికి అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది, మనం చేసిన అభివృద్ధి, సంక్షేమంతోపాటు గొడ్డలిపార్టీ తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ చేయండి, మిమ్మల్ని వెదికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. వడ్డెర సామాజికవర్గానికి చెందిన రమాదేవిని ఎమ్మెల్సీని చేశాం. ఆమె అడగకపోయినా వెదికి బాబుగారు పదవి ఇచ్చారు. మండలపార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్చార్జి ని పొలిట్ బ్యూరో సభ్యులను చేశాం. మీరు చేసే కార్యక్రమాలు పార్టీకి తెలియజేయండి. మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది.
అప్పర్ పెన్నార్ నిర్వాసితులకు పరిహారం అందిస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల వారీగా ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వెళ్తున్నాం. వెలుగొండ నిర్వాసితులకు 800 కోట్లు చెల్లించడమేగాక ఆ ప్రాజెక్టును పూర్తిచేసి, 7 టిఎంసిల నీరు అందించిన ఘనత మన ప్రభుత్వానిది. ఒక్కొక్కటిగా అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేస్తాం. అప్పర్ పెన్నార్ రైతులకు పరిహారం అందజేస్తాం. ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి నిధులు కేటాయిస్తాం. మన ప్రాంతానికి పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలి. పెట్టుబడులు తేవడంలో స్థానిక నాయకత్వానికి కూడా బాధ్యత ఉంది. విద్యాశాఖకు సంబంధించి సునీతమ్మ చేసిన అభ్యర్థనలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎస్.సవిత, హిందూపూర్ ఎంపి బికె పార్థసారధి, ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరాం, హిందూపురం పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు, ప్రధాన కార్యదర్శి హనుమప్ప, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, జిల్లాపార్టీ ఎన్నికల పరిశీలకులు ఏరాసు ప్రతాపరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాప్తాడు నియోజకవర్గ అబ్జర్వర్ పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








