స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నా : మంత్రి లోకేష్
స్థానిక సంస్థల ఎన్నికల్లో 94శాతం కంటే ఎక్కువ గెలవాలి
మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే!
డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం..జగన్ రెడ్డి సిద్ధమా?
నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి
పాదయాత్రలో నాతో నడిచిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా
రాప్తాడులో స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ సభలో మంత్రి లోకేష్
రాప్తాడు: మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. జగన్ రెడ్డి సిద్ధమా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి సవాల్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు కూడలిలో ఏర్పాటుచేసిన స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… ఈ రోజు మనం వేదికపై ఉన్నామంటే కారణం వేదిక కింద ఉన్న టీడీపీ కార్యకర్తల త్యాగం వల్లే. ఈ రోజు నేను స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా, సీఎం చంద్రబాబు గారి తనయుడిగా, బాలయ్య మావయ్య అల్లుడిగా రాలేదు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి కాపలాకాసిన కార్యకర్తగా ఇక్కడకు వచ్చాను. అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో తెలియదు. నాకు అక్కతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు లేరు, కానీ కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చారు. మీ పౌరుషమే వేరు. అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో, సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్టైలే వేరు. ఆనాడు యువగళంలో దారిపొడవునా ప్రజలు నాకు నీరాజనాలు పలికారు. పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆనాటి సంబరం మళ్లీ ఈనాడు చూస్తున్నా.
నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి
నేను కూడా అన్న ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాతనే పుట్టా. రూ.2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ గారు చేపట్టారు. ఈ రోజు మనందరం అన్న ఎన్టీఆర్ గారి వారసులం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్లినా గర్వంగా చెప్పుకోవచ్చు.. నా పార్టీ తెలుగుదేశం, నా పార్టీ, నా అజెండా అన్న ఎన్టీఆర్ అని. చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి, సంక్షేమం చేశారు. పరిటాల రవి గారు కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పనులు చేశారు. మన పార్టీ అధికారంలోకి రాకముందు రాయలసీమలో మహిళలు బయట తిరగాలంటే బయపడే పరిస్థితి. దానికి ఫుల్ స్టాప్ పెట్టిన నాయకుడు మన పరిటాల రవీంద్ర గారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేశారు. ఆనాడు వందలాది మంది మన కార్యకర్తలను హత్య చేశారు. అయినా పరిటాల రవి గారు ఏనాడు భయపడలేదు. పార్టీ సమావేశానికి వెళ్తే చంపేశారు. అయినా ఆ కుటంబం వెనక్కి తగ్గలేదు. పరిటాల సునీతమ్మ ముందుకు వచ్చారు. అసెంబ్లీలో బయపెట్టినా ఆమె భయపడలేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ని కూడా పార్టీకి అంకితం చేశారు.
ఫైటర్ జెట్ తయారీ ఏఎంసీఏ ప్రాజెక్ట్ ను అనంత గడ్డకు తీసుకువచ్చాం
రాప్తాడు ప్రజలు చాలా మంచివారు. ప్రజలను కలిసినప్పుడు ఇప్పుడు ఎవరూ నా చేతులను గీరలేదు. ధర్మవరంలో అయితే మొత్తం గీరేశారు. కార్యకర్తలు, నాయకులు 2019-24 మధ్య పడిన కష్టాలను గుర్తుచేసుకోవాలి. జీవో 1 ద్వారా యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు. స్టూల్, మైక్ లాక్కున్నారు. అయినా ఎక్కడా తగ్గలేదు. వేదిక ముందున్న నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో ఆనాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర చేశా. ఇక్కడి ప్రజల కష్టాలను చూశా. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫైటర్ జెట్ లు తయారుచేసే ఏఎంసీఏ ప్రాజెక్ట్ ను మన అనంతపురం గడ్డకు తీసుకువచ్చా. సాగు, తాగునీరు, పరిశ్రమలను తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రత్యేకంగా నాపై బాధ్యత ఉంది. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ ను, హరి మావయ్య, బాలయ్య మామను గెలిపించి శాసనసభకు పంపించిన అద్భుతమైన నేల ఇది. తాగునీరు, సాగునీరు అందిస్తాం.
కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు.. ఎన్నికలే.. తగ్గేదేలే. కష్టపడాలి, పనిచేయాలి. మనది పెద్ద కుటుంబం. కోటి ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు. మన కుటుంబం పెద్దదైంది. ఇప్పుడు పవనన్న కూడా మన కుటుంబ సభ్యుడు అయ్యారు. బీజేపీ కూడా మన కుటుంబంలో చేరింది. మూడు పార్టీలు ఏపీని ముందుకు తీసుకెళ్తున్నాయి. సమస్యలు ఏవైనా ఉంటే నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకుందాం. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి గౌరవిస్తాం. మన రాష్ట్రాన్ని మనందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే!
గొడ్డలితో బతికినవాళ్లు గొడ్డలితోనే పోతారు. పాఠాలు చెప్పే టీచర్లపై ఎలా దాడి చేశారో చూశాం. అయ్యా జగన్.. ఎందుకు మా ఉపాధ్యాయులంటే నీకు అంత కక్ష. డీఎస్సీపై చర్చకు సిద్ధమని నేను ఎన్నోసార్లు చెప్పా. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? జగన్ రెడ్డి మాదిరిగా ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే మాకు కోర్టు అనుమతి అవసరం లేదు. నీతి, నిజాయతీతో బతికినవాళ్లం. జగన్ రెడ్డి పెట్టిన కేసులు దొంగ కేసులని ఏకంగా సుప్రీంకోర్టే తేల్చిసిన పరిస్థితి. జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు.. మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఉపాధ్యాయులపై దాడికి రౌడీమూకలను పంపారు. మొన్నటివరకు మన పార్టీలో వంగి, వంగి ఉన్నారు. ఇప్పుడు అక్కడకు వెళి కాలరెగరేస్తున్నారు. వదిలిపెట్టను భయ్యా! అన్నీ చూస్తున్నా. ఉపాధ్యాయులపై కోడిగుడ్లు వేస్తారా? అసభ్యంగా మాట్లాడతారా? అసలు మీరెక్కడ చదివారు? ఎవరు చదివించారు? ఇదేనా ఇంట్లో మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కృతి? ఇదేనా ఉపాధ్యాయులకు మీరిచ్చే గౌరవం. నేను వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ కు కట్టుబడి ఉన్నా. ప్రజలకు కూడా చెప్పా. వారి ఆశీస్సులతో 94శాతం స్థానాలు కైవసం చేసుకున్నాం. ఇక్కడున్న కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. కష్టపడదాం, ప్రజలకు సేవచేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94శాతం కంటే ఎక్కువ గెలవాలి. ఈగో వద్దు, ప్రజల్లో ఉందాం.
పాదయాత్రలో నాతో నడిచిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా
రాప్తాడులో స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి గారి విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు నా తమ్ముడు పరిటాల శ్రీరామ్ పుట్టిన రోజు. నా తమ్ముడు పుట్టినరోజు నాడు విగ్రహాలను ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. శ్రీరామ్ కు ఉదయం లేచిన వెంటనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మొదటి మెసేజ్ పెట్టింది నేనే. ఒక్కసారి నమ్మితే నేను వదిలిపెట్టను. ఆనాడు పాదయాత్రలో నాతో నడిచిన వారు, ఆనాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను నడిపించారు. నా జీవితాంతం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు. తనకు ఘనస్వాగతం పలికిన రాప్తాడు ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి ఎస్.సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, దగ్గుపాటి వెంకట ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప తదితరులు పాల్గొన్నారు.








