90 అడుగుల హనుమాన్.. అమెరికా రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు?
కొన్ని సంఘటనలు చాలా చిన్నగా మొదలవుతాయి. కానీ అవి అడిగే ప్రశ్నలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక సోషల్ మీడియా పోస్టు, ఒక విగ్రహం, ఒక వివాదం.. వీటి వెనుక ఒక సమాజంలో నెమ్మదిగా జరుగుతున్న మార్పు దాగి ఉండొచ్చు. ముఖ్యంగా ఒక దేశం తన రూపాన్ని మార్చుకుంటున్నప్పుడు, ఆ మార్పు పెద్ద రాజకీయ ప్రకటనల కంటే ఇలాంటి చిన్న సంఘటనల్లోనే ముందుగా కనిపిస్తుంది.టెక్సాస్‌లోని హనుమాన్ విగ్రహం చుట్టూ ఇప్పుడు జరుగుతున్న వివాదం కూడా అలాంటిదే.
అసలేం జరిగింది
టెక్సాస్‌లోని షుగర్‌ల్యాండ్ ప్రాంతంలో నిలిచిన 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని మొదటిసారి చూసినప్పుడు ఎవరికైనా ఒకటే భావన కలుగుతుంది. అది భక్తికి, విశ్వాసానికి ప్రతీక అని. నగర శివార్లలోని ప్రధాన రహదారుల మీదుగా ప్రయాణించే వారికి మైళ్ల దూరం నుంచే కనిపించే ఈ విగ్రహం, భారతదేశం నుండి వేల మైళ్ల దూరంలో స్థిరపడిన వలసదారులు తమ సాంస్కృతిక వేళ్లను ఎంత బలంగా నాటుకున్నారో చాటిచెబుతుంది. అయితే, ప్రార్థనా స్థలానికి మాత్రమే పరిమితం కావాల్సిన ఈ ఆధ్యాత్మిక నిర్మాణం, అనుకోకుండా అమెరికా రాజకీయాల నడిబొడ్డున నిలబడింది.
సెప్టెంబరు నెలలో ‘MAGA’ ( మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) భావజాలానికి మద్దతు ఇచ్చే యూట్యూబర్ జెస్సీ హ్యూస్, ఈ హనుమాన్ విగ్రహం ఫొటోను ‘X’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ.. “మేము గెలిచినప్పుడు దీనిని కూల్చేస్తాం” అని సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఒక్క సోషల్ మీడియా పోస్టుతో మతం, ఇమ్మిగ్రేషన్, జాతీయ గుర్తింపు, రాజకీయ అధికారం వంటి సున్నితమైన అంశాలపై పెను తుఫాను రేగింది.
ఆ వాక్యంలో అత్యంత గమనించదగ్గ పదం “కూల్చేస్తాం” కాదు. “మేము గెలిచినప్పుడు.” ఆ ఒక్క పదం … ఒక విగ్రహం పై చేసిన వ్యాఖ్యను, ఎన్నికల రాజకీయాల భాషలోకి మార్చింది.ఒక మతపరమైన చిహ్నాన్ని నేరుగా అధికార పక్షం ఎన్నికల రాజకీయాలతో ముడిపెట్టడం వల్ల, “ఒక నిర్దిష్ట వర్గం అధికారంలోకి వస్తే మైనారిటీ మతాల ప్రార్థనా స్థలాల భద్రత ఏమిటి?” అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. షుగర్‌ల్యాండ్‌లోని హనుమాన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పరు. కానీ వాటిని కనిపించేలా చేసారు.
అమెరికా శివార్లలో పెరిగిన మరో ప్రపంచం
కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలో భారతీయ కుటుంబాల మతపరమైన జీవితం చాలా వరకు ఇళ్లలోనే జరిగేది. పండుగలు అపార్ట్మెంట్లలో, కమ్యూనిటీ హాళ్లలో, స్నేహితుల ఇళ్లలో జరిగేవి. దేవుళ్ల చిత్రాలు గోడలపై ఉండేవి. పిల్లలు వారాంతాల్లో భాషా తరగతులకు వెళ్లేవారు.
తర్వాత దేవాలయాలు వచ్చాయి.
దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలుగా ఉండలేదు. అవి ఒక సమాజం తనను తాను గుర్తించుకునే ప్రదేశాలుగా మారాయి. అక్కడ పూజలు జరిగాయి; పిల్లలకు సంస్కృతం, తెలుగు, తమిళం, హిందీ నేర్పించారు. వివాహాలు జరిగాయి. పండుగలు జరిగాయి. భారతదేశానికి వేల మైళ్ల దూరంలో, భారతదేశంలోని ఒక చిన్న భాగాన్ని పునర్నిర్మించుకోవడం మొదలైంది. షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో 2024లో ప్రతిష్ఠించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహం ఆ ప్రక్రియను సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఒకప్పుడు ‘వలసదారులు’.. ఇప్పుడు బహిరంగ గుర్తింపు
టెక్సాస్‌లో ఐదు లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రిపబ్లికన్ పార్టీకి బలమైన ఆధిపత్యం ఉంది. ఇలాంటి ప్రదేశంలో భారతీయ అమెరికన్ సమాజం తన మతపరమైన, సాంస్కృతిక గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించడం అమెరికా సమాజంలో జరిగిన ఒక పెద్ద మార్పును సూచిస్తుంది.
వలస వచ్చిన మొదటి తరం “ఇక్కడ ఎలా కలిసిపోవాలి?” అని ఆలోచిస్తే, ఇక్కడే పుట్టి పెరిగిన రెండో తరం తమ మూలాలను, గుర్తింపును సగర్వంగా ప్రదర్శించడానికి వెనుకాడటం లేదు. టెక్సాస్‌లో దాదాపు ఐదు లక్షలకు పైగా ఉన్న భారతీయ అమెరికన్ల ప్రాబల్యానికి ఈ విగ్రహం ఒక బలమైన నిదర్శనంగా మారింది.
వాదనలు – ప్రతివాదనలు: అమెరికన్ విలువలు వర్సెస్ విమర్శలు
జెస్సీ హ్యూస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికాలోని హిందూ సమాజం నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా అమెరికా సైన్యంలో సేవందించిన మాజీ యోధుడు రుచిర్ బక్షి స్పందిస్తూ, ఈ రకమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాను అమెరికా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసినప్పుడు క్రైస్తవులు, యూదులు, ముస్లింలు మరియు నాస్తికులతో కలిసి పనిచేశానని, ఏ ఒక్క మతాన్నీ లేదా మత చిహ్నాన్ని ధ్వంసం చేయడం అమెరికా రాజ్యాంగ విలువలకు పూర్తి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే, ఈ విగ్రహాన్ని సమర్థిస్తున్నవారు భారతదేశం లేదా హిందూ మతాచారాల కోణంలో మాత్రమే మాట్లాడటం లేదు. వారు తమ హక్కులను కాపాడుకోవడానికి అమెరికా రాజ్యాంగం ప్రసాదించిన ‘మత స్వేచ్ఛ’ అనే ప్రాథమిక సూత్రాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. మరోవైపు, అమెరికాలోని కొంతమంది సంప్రదాయవాదులు మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఒక దేశంలో ప్రధాన సంస్కృతికి భిన్నంగా, విదేశీ మత చిహ్నాలు ప్రజాక్షేత్రంలో ఇంత భారీగా వెలియడం వల్ల ఆ దేశ మూల సంస్కృతి దెబ్బతింటుందనేది వారి ప్రధాన ఆందోళన.
మారుతున్న ‘అమెరికన్’ నిర్వచనం
టెక్సాస్‌లో దక్షిణాసియా సమాజం ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు కేవలం ఈ విగ్రహానికే పరిమితం కాలేదు. ఇటీవల రిపబ్లికన్ నాయకుడు బో ఫ్రెంచ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో దక్షిణాసియా విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ ఫొటోను షేర్ చేస్తూ, అక్కడి ప్రవేశ నిబంధనలపై విమర్శలు గుప్పించారు. దీనిపై జాతి వివక్ష కోణంలో విమర్శలు రాగా, సెనేటర్ జాన్ కార్నిన్, హౌస్ డెమోక్రటిక్ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ వంటి అగ్రనేతలు కూడా స్పందించాల్సి వచ్చింది. ఫ్రెంచ్ మాత్రం తాను కేవలం స్థానిక విద్యార్థుల ప్రయోజనాల గురించే మాట్లాడానని సమర్థించుకున్నారు.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అమెరికాలో భారతీయ అమెరికన్లు ఇప్పుడు కేవలం వ్యాపారవేత్తలుగానో, ఐటీ నిపుణులుగానో, వైద్యులుగానో మాత్రమే లేరు; వారు ఆ దేశ రాజకీయ, సామాజిక శక్తులుగా ఎదుగుతున్నారు. అమెరికా చరిత్రలో గతంలో కాథలిక్కులు, యూదులు ఎదుర్కొన్న సామాజిక ప్రశ్నలనే ఇప్పుడు హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎదుర్కొంటున్నారు.
షుగర్‌ల్యాండ్‌లోని ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహం కేవలం ఒక భక్తి చిహ్నం మాత్రమే కాదు; మారుతున్న అమెరికా సామాజిక చిత్రాన్ని, “అసలైన అమెరికన్ ఎవరు?” అనే ప్రశ్నకు మారుతున్న నిర్వచనాన్ని మనకు కళ్లకట్టినట్లు చూపే ఒక అద్దం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








