వృద్ధ ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక..!
రాష్ట్రంలోని వయోవృద్ధులైన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో పెరిగే ఖర్చులకు ఆసరాగా నిలిచే ‘అదనపు పింఛను’ (Additional Quantum of Pension) శాతాన్ని గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొత్త జీవో జారీ చేసింది. గత కొంతకాలంగా పెన్షనర్లు చేస్తున్న డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి అదనపు అలవెన్సులను పెంచుతూ ఈ ఉత్తర్వులకు ఆమోదం తెలిపారు.
ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం పెన్షన్ స్లాబ్లలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందులో భాగంగా 70 ఏళ్ల నుండి 75 ఏళ్ల లోపు వయసున్న వృద్ధుల అదనపు పింఛనును ప్రస్తుతం ఉన్న 7 శాతం నుండి 10 శాతానికి పెంచారు. అదేవిధంగా, 75 సంవత్సరాల నుండి 80 ఏళ్ల లోపు వయసు కలిగిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు లబ్ధిని 12 శాతం నుండి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, 80 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు ఇచ్చే అదనపు పింఛను శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదని, వారికి పాత నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో నాలుగు లక్షల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఈ పెరిగిన అదనపు పింఛను విధానాన్ని డిసెంబర్, 2026 పెన్షన్ నుండి అమలు చేయనున్నారు. దీని ప్రకారం, పెరిగిన మొత్తంతో కూడిన మొదటి నెల పింఛను నగదు జనవరి 1, 2027న వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అదనపు పింఛన్లు పెంచినందుకు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.








