పిఠాపురం పల్లెల్లో పారిశుద్ధ్య లోపాలు కనబడకూడదు: పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో రూ. 1,500 కోట్ల విలువైన మెగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన, మంగళవారం క్షేత్రస్థాయిలో అకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణాలను స్వయంగా పరిశీలించేందుకు ఆయన వీధుల్లో కాలినడకన పర్యటించారు. గత కొన్ని రోజులుగా పవన్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
పర్యటనలో భాగంగా పిఠాపురం పరిధిలోని పల్లెల్లో పారిశుధ్య నిర్వహణను పవన్ కల్యాణ్ నిశితంగా గమనించారు. మురుగు కాలువలు, అంతర్గత రహదారుల దుస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై, గ్రామాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి ప్రాథమిక వసతుల అందుబాటుపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ సేకరించారు. తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి నేరుగా చెప్పుకునే అవకాశం రావడంతో స్థానికులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు.
ఇవి కూడా చదవండి
గ్రామాల్లో పారిశుధ్య లోపాలు, అపరిశుభ్ర వాతావరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పిఠాపురం పల్లెల్లో ఎక్కడా పారిశుద్ధ్య లోపాలు కనబడకూడదు” అని అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రజలకు అందాల్సిన కనీస మౌలిక వసతుల కల్పనలో గానీ, ప్రభుత్వ సేవల సరఫరాలో గానీ ఎలాంటి జాప్యం ఉండరాదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.








