సినీ పరిశ్రమకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
గత కొన్నేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సినిమా, టెలివిజన్ రంగాలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చలనచిత్ర రంగానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డుల’ను మళ్లీ అత్యంత వైభవంగా పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. గత వైకాపా ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమను, అవార్డులను పూర్తిగా పక్కన పెట్టేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల(Pawan Kalyan) ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలను మళ్లీ పండుగలా నిర్వహించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ప్రకటనలు వెలువడి, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు అందజేయకుండా నిలిచిపోయిన 2012 నుండి 2016 వరకు గల నంది అవార్డులను త్వరలోనే పూర్తిస్థాయిలో విజేతలకు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఇక ఆ తర్వాత కాలానికి.. అంటే 2017 నుండి 2024 వరకు గల సంవత్సరాలకు సంబంధించి ఫిల్మ్ అండ్ టీవీ విభాగాలలో ప్రతి ఏడాదికి నాలుగు అవార్డుల చొప్పున (రెండు ప్రొడక్షన్ అవార్డులు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు) ప్రత్యేకంగా ప్రదానం చేయాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుదీర్ఘకాలంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది అర్హులైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎట్టకేలకు న్యాయం జరగనుంది.
ఇవి కూడా చదవండి
ఈ మొత్తం అవార్డుల పునరుద్ధరణ ప్రక్రియతో పాటు, నూతన సంవత్సరానికి సంబంధించిన 2025 నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఈ అవార్డుల వేడుకను సౌత్ ఇండియాలోనే ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.








