కూతురు పెళ్లి పత్రిక ఇస్తే రాజకీయాలా..?
తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి(YS Jagan) అందించడంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విశ్లేషణలను, ప్రచారాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పూర్తిగా త్రోసిపుచ్చారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు కొందరు కావాలనే కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఈ రకమైన రాజకీయ విశ్లేషణలు పూర్తిగా నిరాధారమని, శుద్ధ అబద్ధమని ఆమె కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ రాసుకొచ్చారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా కలిసింది తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రిక ఇచ్చినప్పుడేనని షర్మిల గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కలిసింది కేవలం తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందించడానికేనని స్పష్టం చేశారు. ఒక తల్లిగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి పిలవడం కనీస సంస్కారమని, ఇందులో ఎలాంటి వింత లేదని తేల్చి చెప్పారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఆమె ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
ఒక పవిత్రమైన శుభకార్యానికి రాజకీయ రంగు పూస్తూ.. ప్రజల్లో తనపై ఉన్న విశ్వసనీయతను, నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని షర్మిల గట్టిగా హెచ్చరించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, కొత్తగా ఒక్కటి కాబోతున్న నవదంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని ఆమె కోరారు. కాగా గత కొన్నాళ్ళుగా షర్మిలకు, జగన్ కు మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.








