దానం నాగేందర్ కేసు రేపటికి వాయిదా!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆయనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ పై వాస్తవానికి ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. అయితే ఇవాళ ఇది లిస్ట్ కాలేదు. రేపు దీనిపై విచారణ జరగనుంది. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రీ ప్రకటించారు.
పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న సంచలన తీర్పు వెలువరించింది. దానంపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి నెలకొనగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఈ కేసులో ఎలాంటి ఏకపక్ష ఉత్తర్వులు రాకుండా తమ వాదనలు కూడా వినాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ కేసుకు సంబంధించి సోమవారం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. స్పీకర్ వద్ద ఉన్న అనర్హత పిటిషన్ను తిరస్కరించినప్పటికీ, హైకోర్టు జోక్యం చేసుకుని అనర్హత వేటు వేయడాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో ఎప్పుడైనా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, అందువల్ల ఈ SLPని అత్యవసర ప్రాతిపదికన విచారించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన రిజిస్ట్రీ, ధర్మాసనం విచారణ తేదీని ఖరారు చేయడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసు తీర్పు కేవలం దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా.. దేశంలో ఫిరాయింపుల చట్టం, స్పీకర్ అధికారాలు, హైకోర్టుల జోక్య పరిధి.. లాంటి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గురువారం సుప్రీంకోర్టు వెలువరించే ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప ఎన్నిక ముప్పు పొంచివున్న తరుణంలో సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.








