ఆశావహులకు దసరా కానుక!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో, అధికార కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు త్వరలోనే పదవుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ నియామకాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సహకార సంఘాలు, PACS, మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పార్టీ అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆశావహుల జాబితాను హైకమాండ్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నియామకాలపై తుది నిర్ణయం వెలువడనుంది. విజయదశమి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, కార్యకర్తలకు దసరా కానుకగా అందించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
గత ఎన్నికల నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకులు, గ్రాస్‌రూట్ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో పార్టీలోకి కొత్తగా చేరిన నాయకులకు సుమారు 20 శాతం మేర ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. అలాగే సామాజిక సమతుల్యతను కాపాడడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఖాళీగా ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ వంటి ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేసే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి.. దసరా పండుగ వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోయే ఈ నామినేటెడ్ పదవుల జాబితా పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తొలగించి, శ్రేణుల్లో జోష్ నింపుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాబోయే రాజకీయ పోరుకు ఈ నియామకాలు ఒక బలమైన పునాదిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.








