iPhone కొన్నవారికి $95 పరిహారం? ఎందుకు ఇస్తోంది కంపెనీ?
ఒక కొత్త iPhone కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడు సాధారణంగా దాని కెమెరా, బ్యాటరీ, డిజైన్, ప్రాసెసర్ వంటి ఫీచర్లను పరిశీలిస్తూంటారు. అది సహజం. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో అంశం వచ్చి చేరింది. అది మరేదో కాదు..ఆ ఫోన్లో వచ్చే AI సామర్థ్యాలు. iPhone నుంచి అవే ఎక్సపెక్ట్ చేసారు కొనుగోలు దారులు. అయితే అవి అక్కడ కనపడకపోవటంతో వివాదంకు దారి తీసింది.
అసలు వివాదం ఎలా మొదలైంది?
2024లో Apple తన Apple Intelligence వ్యూహాన్ని ప్రకటించింది. Siriకి వస్తాయని చెప్పిన కొన్ని కొత్త సామర్థ్యాలు ఈ ప్రకటనలో ముఖ్యమైన భాగం. ఈ ఫీచర్లలో కొన్ని ఆలస్యమయ్యాయి.
దీంతో కొంతమంది వినియోగదారులు తమకు చూపించిన సామర్థ్యాలపై ఏర్పడిన అంచనాతోనే iPhone కొనుగోలు చేశామని, ఆ అనుభవం తమకు అందలేదని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై క్లాస్ యాక్షన్ కేసు దాఖలైంది.
Apple మాత్రం ఆరోపణలను ఖండించింది. సెటిల్మెంట్కు అంగీకరించడం ద్వారా కంపెనీ ఎలాంటి తప్పు లేదా బాధ్యతను అంగీకరించినట్లు కాదని ఒప్పందం కూడా స్పష్టం చేస్తోంది. అంటే ఈ కేసులో Apple తప్పు చేసిందని కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు.
పరిహారం ఎంత
ఈ సెటిల్మెంట్ కింద అర్హత ఉన్న కొంతమంది అమెరికన్ iPhone వినియోగదారులకు ఒక్కో పరికరానికి గరిష్ఠంగా $95 వరకు పరిహారం లభించే అవకాశం ఉంది. అయితే ఇది Apple ఉన్న ప్రతి iPhone కొనుగోలుదారుడికి ఇస్తున్న రిఫండ్ కాదు. అలాగే కంపెనీ తన తప్పును అంగీకరించి చెల్లిస్తున్న మొత్తమూ కాదు. ఇది ఒక క్లాస్ యాక్షన్ కేసును పరిష్కరించేందుకు కుదిరిన ఒప్పందం. ఇది కేసును మరింత ముందుకు తీసుకెళ్లడం వల్ల వచ్చే ఖర్చులు, నష్టాలు, అనిశ్చితిని నివారించేందుకు ఇరుపక్షాలు చేసుకున్న ఒప్పందం.
మరి $250 మిలియన్ ఎందుకు?
ఈ కేసును పరిష్కరించేందుకు Apple మొత్తం $250 మిలియన్ సెటిల్మెంట్ ఫండ్ కు అంగీకరించింది. ఈ మొత్తంలో నుంచి అర్హత ఉన్న వినియోగదారులకు పరిహారం చెల్లించడంతో పాటు, కేసుకు సంబంధించిన ఇతర ఖర్చులు, న్యాయపరమైన ఫీజులు వంటి అంశాలు కూడా ఉంటాయి. ఈ సంఖ్యను చూసి ప్రతి iPhone యూజర్‌కు $95 వస్తుందని అనుకోవడం తప్పు.
$95 గరిష్ఠ మొత్తం మాత్రమే.
చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ దాఖలు చేసిన అర్హత ఉన్న వినియోగదారుడికి ఒక్కో పరికరానికి ప్రారంభంగా $25 చెల్లించే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని valid claims వస్తాయి, సెటిల్మెంట్ ఫండ్ నుంచి ఇతర ఖర్చులు ఎంత వెళ్తాయి వంటి అంశాల ఆధారంగా తుది మొత్తం మారుతుంది. అది $95 వరకు పెరగవచ్చు. తగ్గవచ్చు కూడా. అందువల్ల ఇది “iPhone కొంటే $95” అనే cashback పథకం కాదు.
ఇవి కూడా చదవండి
ఎవరు డబ్బు పొందవచ్చు?
ఈ సెటిల్మెంట్ అమెరికాలోని అర్హత ఉన్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత పొందాలంటే: అమెరికాలో నివసిస్తూ ఉండాలి. అర్హత ఉన్న iPhoneను అమెరికాలో కొనుగోలు చేసి ఉండాలి. కొనుగోలు తేదీ జూన్ 10, 2024 నుంచి మార్చి 29, 2025 మధ్య ఉండాలి. ఆ ఫోన్‌ను మొదట కొనుగోలు చేసిన వ్యక్తే క్లెయిమ్ చేయాలి. అర్హత ఉన్న మోడళ్లలో iPhone 15 Pro, iPhone 15 Pro Max, అలాగే iPhone 16 సిరీస్‌లోని మోడళ్లు ఉన్నాయి. క్లెయిమ్ చేయడానికి iPhone serial number అవసరం. చెల్లింపు కోసం PayPal, Venmo, Direct Deposit లేదా Check వంటి ఎంపికలు ఉన్నాయి.
క్లెయిమ్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 21, 2026.
భారతీయ iPhone వినియోగదారులకు ఏంటి?
ఇండియాలో కొనుగోలు చేసిన iPhoneలకు ఈ పరిహారం వర్తించదు.
భారత్‌లో iPhone 15 Pro లేదా iPhone 16 కొనుగోలు చేసినా, ఆ కొనుగోలు ఈ అమెరికన్ settlement పరిధిలోకి రాదు. కారణం settlement class అమెరికాలో నివసిస్తూ, అక్కడ అర్హత ఉన్న iPhone కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే పరిమితం కావడం. కాబట్టి ఇది Apple ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన compensation programme కాదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








