గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. వడపోత పనులు, క్షేత్రస్థాయి సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానం ఇన్చార్జిగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తుండగా, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున సమర్థులైన పేర్లతో కూడిన ప్రతిపాదనలను తయారు చేసి పీసీసీకి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రెండు నియోజకవర్గాలలోనూ టికెట్ ఆశిస్తున్న నాయకుల సంఖ్య భారీగానే ఉంది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్, గౌరీ సతీశ్, వేణుగోపాల్ రెడ్డి, భీమ్ భరత్ తదితరులు పోటీ పడుతున్నారు. మరోవైపు ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి లోకేశ్ యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి, చనగాని దయాకర్, కైలాశ్ నేతతో పాటు ఒక మంత్రి సోదరుడు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అభ్యర్థుల ఎంపికలో కేవలం సామాజిక వర్గాలవారీ సమీకరణాలకే పరిమితం కాకుండా.. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. గతంలో లాగా ఒకే సామాజిక వర్గానికి రెండు స్థానాలు కేటాయించాలా లేక ప్రాంతీయ, సామాజిక సమతుల్యత పాటించాలా అనే దానిపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తోంది. ఒక స్థానాన్ని ఓసీకి, మరొకటి బీసీకి కేటాయించే అవకాశాలపై కూడా పరిశీలన సాగుతోంది.
ఎన్నికల్లో గెలుపు అత్యంత ముఖ్యం కాబట్టి, కేవలం పార్టీ నేపథ్యమే కాకుండా అభ్యర్థి వ్యక్తిగత బలాబలాలు, పట్టభద్రులతో ఉన్న సంబంధాలు, ఆర్థిక, అంగబలాన్ని కూడా కాంగ్రెస్ బేరీజు వేస్తోంది. ఒక్కో ఎమ్మెల్సీ నియోజకవర్గం దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే పలు పార్లమెంట్ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారం, సమన్వయం ఉండేలా చూస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఆశావహుల బలాలపై పీసీసీ ఇప్పటికే ప్రత్యేక సర్వేలు కూడా నిర్వహించినట్లు సమాచారం.
ఈ నెల 28 నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోపు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ప్రకటించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే పీసీసీ ఈ ముగ్గురు పేర్ల జాబితాను ఏఐసీసీకి పంపనుంది. అక్కడి నుంచి తుది అభ్యర్థి ఎంపిక ప్రకటన వెలువడనుంది. ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టి, శాసనమండలిలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి.








