సాయికృష్ణ అదృశ్యం కేసు … సుప్రీంకోర్టులో విచారణ
విజయవాడలోని కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగిన సాయికృష్ణ (Saikrishna) అదృశ్యం కేసుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఉన్నతస్థాయి అధికారులను దర్యాప్తులో చేర్చకపోవడంపై వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి (MP Maddila Gurumoorthy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం హైకోర్టు ( High Court)లో జరుగుతున్న విచారణ పై స్టేవిధిస్తూ అన్ని కేసులను సుప్రీంకోర్టు కు బదిలీ చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేసులో సీబీఐని ప్రతివాదిగా చేరుస్తున్నట్లు పేర్కొంది. పోలీసు కస్టడీలో సాయికృష్ణ మాయం కావడం చట్ట వ్యతిరేకమేనని జస్టిస్ విక్రమ్‌నాథ్ అన్నారు. కేసు వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఉంచి సెప్టెంబర్ 30నాటికి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 12కి వాయిదా వేసింది.








